తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం - రైతువేదికల ప్రారంభం

రైతులంతా ఒక్క చోట చేరి పంటల బాగోగులు, మార్కెట్ ధరలు సహా సంబంధిత అంశాలపై చర్చించుకునేందుకు రైతు వేదికలు సిద్ధమయ్యాయి. ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున వ్యవసాయ క్లస్టర్ల వారీగా వేదికల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఉపాధిహామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి మొత్తం రూ.572 కోట్లతో రైతు వేదికల నిర్మాణం జరుగుతోంది. అన్నదాతల సంఘటితమే లక్ష్యంగా నిర్మించిన రైతు వేదికల్ని... సీఎం కేసీఆర్‌ జనగామ జిల్లా కొడకండ్లలో ఇవాళ ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించనున్న సభలో ప్రభుత్వ సంకల్పాన్ని రైతులకు వివరించనున్నారు. సీఎం పర్యటన కోసం జనగామ జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు.

raithu vedhika buildings starts from today in telangana
రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం

By

Published : Oct 31, 2020, 5:06 AM IST

రైతు వేదికల నిర్మాణంతో కొత్తశకం... నేడు ప్రారంభించనున్న సీఎం

వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. రైతులు పండించిన పంటలకు మంచి ధరే లక్ష్యంగా వివిధ చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని నేలల స్వభావం, అవసరాల ఆధారంగా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ విస్తరణ సేవలను ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది.

5వేల ఎకరాలకొకటి..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంటపొలాలను ఐదువేల ఎకరాలకు ఒకటి చొప్పున 2,601 క్లస్టర్లుగా విభజించింది. ఆయా క్లస్టర్లలోని రైతులందరూ ఒకే చోట చేరి చర్చించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రైతువేదికల నిర్మాణాన్ని చేపట్టింది. సంబంధిత క్లస్టర్ పరిధిలోని రైతులందరూ పంటలకు సంబంధించిన బాగోగులు, మార్కెట్ పరిణామాలు, ధరలపై చర్చించుకోవాలన్నది రైతు వేదికల ఉద్దేశం.

రూ.571 కోట్ల ఖర్చు...

రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం మొత్తం రూ.571 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒక్కో రైతు వేదిక నిర్మాణం కోసం రూ.22 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అందులో 12 లక్షలు వ్యవసాయశాఖ నుంచి, మిగతా పది లక్షలు జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి వినియోగిస్తున్నారు. మొత్తం 2,601 రైతువేదికల్లో గ్రామీణ ప్రాంతాల్లోనివి 2,462 కాగా... పట్టణప్రాంతాల్లోనివి 139.

139 రైతువేదికలకు భూములు దానం...

సొంత భూమి, నిధులతో రైతువేదికల నిర్మాణం కోసం రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, ప్రవాసులు కొందరు ముందుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 22, పట్టణ ప్రాంతాల్లో రెండు రైతువేదికల నిర్మాణ పూర్తి వ్యయాన్ని దాతలే భరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 139 రైతువేదికల నిర్మాణం కోసం ఉచితంగా భూములు ఇచ్చారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 137 కాగా... పట్టణ ప్రాంతాల్లో రెండు ఉన్నాయి. మిగతా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో రైతువేదికల నిర్మాణం జరుగుతోంది. రైతువేదికలను అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. రైతులు కూర్చొని మాట్లాడుకోవడంతో పాటు ఏఈఓకు గదిని కూడా నిర్మిస్తున్నారు.

పూర్తైన 1,951 రైతు వేదికల నిర్మాణం...

రైతులకు వ్యవసాయ, ఉద్యానవన అధికారులు అవగాహన కల్పించేందుకు రైతువేదికలను వినియోగించనున్నారు. అటు ప్రతి రైతువేదికలోనూ దృశ్యమాధ్యమ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆన్​లైన్ విధానంలో ముఖ్యమంత్రి నేరుగా ఆయా క్లస్టర్లలోని రైతులతో మాట్లాడేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,951 రైతు వేదికల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 650 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. రైతువేదికలు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

రైతువేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబు

ముఖ్యమంత్రి ప్రారంభించనున్న కొడకండ్ల రైతు వేదికను అధికారులు సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. కడెం నర్సరీ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మొక్కలతో.... ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్​లు... దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు..

జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించిన రైతువేదికను ముఖ్యమంత్రి కేసీఆర్... నేడు మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభిస్తారు. రైతువేదికల నిర్మాణ ఉద్దేశం, ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలను సీఎం వివరించనున్నారు. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రంలోని మిగతా రైతువేదికలు కూడా ప్రారంభం కానున్నాయి.

ఇవీ చూడండి: ఈసారి ధాన్యం అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు: మంత్రి సత్యవతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details