తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పేరుతో ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాల దందా.. - జనగామ కరోనా వార్తలు

కరోనా వైరస్‌ ప్రభావం జనగామ జిల్లాలో రోజురోజుకు పెరుగుతోంది.. కేసుల తీవ్రత పెరిగే కొద్దీ దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉంటే ప్రజలు వణికిపోతున్నారు.. ఏ చిన్న సమస్య తలెత్తినా కరోనా సోకిందేమోననే అనుమానాలు పెరిగిపోతున్నాయి.. ప్రజల భయం... అమాయకత్వాన్ని జనగామ జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలు సొమ్ము చేసుకుంటున్నాయి.

coronavirus
coronavirus

By

Published : Jul 26, 2020, 12:31 PM IST

జనగామ జిల్లా పరిధిలోని 12 మండలాల ప్రజలకే కాకుండా యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు చెందిన మరో ఆరు మండలాలకు జనగామ పట్టణం దగ్గరగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్య అవసరాలతోపాటు ఆసుపత్రులు, ఇతర వైద్య సౌకర్యాలకు కూడా ఆయా మండలాల ప్రజలు ఇక్కడకే వస్తుంటారు.

ఇదే సమయంలో ఐదు నెలలుగా ప్రజలు వైరస్‌ బారిన పడుతున్నారు. కరోనా వైరస్‌ నిర్ధరణకు ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిలో రాపిడ్‌ టెస్టులు, ఆర్టీపీసీఆర్‌ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పీహెచ్‌సీల్లో కూడా కరోనా నిర్ధరణ పరీక్షలు చేపట్టనున్నట్లు తాజాగా జిల్లా వైద్యాధికారులు ప్రకటించిన విషయం విదితమే. అయితే చాలామంది మొదట ప్రైవేటు స్కానింగ్‌ కేంద్రాలకు వెళ్తుండడం విస్మయానికి గురి చేస్తోంది.

పెరుగుతున్న అపోహాలు..

దగ్గు, జలుబు, ఇతర చాతీ సంబంధిత సమస్యలు ఉంటే కరోనా అంటూ అపోహలు పెరిగిపోతుండడంతో ఆయా సమస్యలు తలెత్తిన చాలామంది జనగామలో తమకు తెలిసిన వైద్యుల వద్దకు వస్తున్నారు. వారు ఇటీవల సొంతంగా నెలకొల్పిన స్కానింగ్‌ కేంద్రాలు, లేకుంటే తమకు కమీషన్లు ఇచ్చే కేంద్రాలకు హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌ల కోసం సిఫార్సు చేస్తున్నారు.

దీంతో గత కొద్ది నెలలుగా పట్టణంలోని కొన్ని స్కానింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి కనిపిస్తున్నారు. గతంలో హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌ కోసం రూ.6 వేలు తీసుకునే వారు. ఇప్పుడు ఏకంగా ఒక్కొక్కరికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు దండుకుంటున్నట్లు తెలిసింది.

ఏమిటీ ‘హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌...!

ప్రస్తుతం కరోనా వైరస్‌ శ్వాస సంబంధిత సమస్యతో వస్తోంది. శ్వాసకోశ గ్రంథుల్లో వైరస్‌ చేరి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పెడుతూ... దగ్గు, జలుబు ఇతరత్ర సమస్యలు సృష్టిస్తూ ఇమ్యూనిటీ లేని వారిలో తొందరగా ప్రభావం చూపి మృత్యువాత పడేలా చేస్తోంది.

హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌తో అంటే శ్వాసకోశ గ్రంథుల్లోని గాలి గ్రంథులను స్కానింగ్‌ తీస్తారు. అక్కడ వైరస్‌లు, బాక్టీరియాలు ఉంటే తదుపరి చికిత్సకు సిఫార్సు చేస్తారు. సరిగ్గా ఈ హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌ తీస్తే దాదాపుగా 90 శాతం కరోనా వైరస్‌ ఉందో లేదో తెలుస్తోందని ఓ వైద్యుడు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

పట్టణంలోని కొందరు వైద్యులు ఈ తరహా స్కానింగ్‌లకు సిఫార్సులు చేసి, పాజిటివ్‌ వస్తే హైదరాబాద్‌ ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రులకు పంపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా కొందరు వైద్యులు అక్రమ దందాకు తెరలేపారని తెలుస్తోంది. అయితే వీరికి రాజకీయ పలుకుబడి ఉండడంతో ఎవరూ ఏమీ చేయలేకపోవడం, ఎలాంటి తనిఖీలు జరగడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణ జబ్బులకు కూడా..

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధుల బారిన పడిన ప్రజలు ఆయా ఆసుపత్రులకు వెళ్తే సాధారణ దగ్గు, జలుబు, ఇతరత్రా సమస్యలకు కూడా కొందరు వైద్యులు అవసరమైన సాధారణ ఎక్స్‌రేలు కాకుండా హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌లు రాస్తూ కరోనా భయం చూపెట్టి వేలాది రూపాయలు దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ తరహా స్కానింగ్‌లు తీసి కరోనా నిర్ధరణ పేరుతో హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఈ ప్రాంతం నుంచి పేషెంట్లను పంపిస్తున్నట్లు సమాచారం. ఆయా ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన వారు చెల్లించే లక్షలాది బిల్లుల్లో నుంచి ఇక్కడి వైద్యులకు కమీషన్ల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు అందుతున్నాయని జనగామలో చర్చించుకుంటున్నారు.

ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం

జనగామలో ఉన్న సిటీ స్కానింగ్‌ కేంద్రాలను ఒకసారి తనిఖీ చేశాం. కరోనా నేపథ్యంలో కొన్ని సిటీ స్కానింగ్‌ కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తేలితే చర్యలు తీసుకుంటాం. హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌ విషయం నాకు తెలియదు. కానీ, ఛాతీ సంబంధిత సమస్యలతో తీసిన సిటీ స్కానింగ్‌ రిపోర్టులు, ఎన్ని డబ్బులు తీసుకున్నారనే ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ మహేందర్‌, జిల్లా వైద్యాధికారి

స్కానింగ్‌ కేంద్రాల్లో తనిఖీలు లేవు..

జనగామ జిల్లా మొదటి కలెక్టర్‌ శ్రీదేవసేన హయాంలో అప్పటి డీఎంహెచ్‌వో డాక్టర్‌ అన్నప్రసన్నకుమారి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాలపై పలుమార్లు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఏడాది కాలంగా వాటిపై తనిఖీలు లేకపోవడంతో వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్కానింగ్‌ల పేరుతో, కార్పొరేట్‌ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని చికిత్సల పేరుతో దోపిడీ చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి తనిఖీ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details