రైతులకు ఇతర పంటల పట్ల అవగాహన కల్పించకుండా... రైతుబంధు నిలిపివేస్తామనడం దారుణమన్నారు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మేకల భాస్కర్ రెడ్డి. దీనిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకూ వెన్నంటి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
'అన్నదాతల గోసను పట్టించుకునే నాథుడే కరువయ్యారు ' - అన్నదాతల సమస్యలు
ప్రభుత్వం సూచించిన పంట వేస్తేనే వారికి రైతుబంధు వర్తిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మేకల భాస్కర్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న గోసను పట్టించుకునే నాథుడే కరువయ్యారు అని మండిపడ్డారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని గోదాములకు తరలించడానికి అధికార యంత్రాంగం తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి... ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు పేరుతో రైతుల పంటల స్వేచ్ఛను హరించ వద్దన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శిరీష్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.