గ్రామాలు, పట్టణాల్లో కోతుల బెడద తారాస్థాయికి చేరింది. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాల్లో ప్రధాన చర్చ ఈ సమస్యపైనే సాగుతోందంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఆరు లక్షలకు పైగా కోతులు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. క్షేత్రస్థాయిలో మాత్రం అనేక రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అడవులు తగ్గడంతో జనావాసాల్లోకి వచ్చి కోతులు తిష్ఠ వేస్తున్నాయి. గుంపులుగుంపులుగా తిరుగుతుండటంతో వీధిలోకి వెళ్లే మాట అటుంచితే.. ఇళ్లలోనూ తలుపులు వేసుకుని ఉండాల్సి వస్తోంది. పెద్ద రైతులు కొందరు తమ పొలాల చుట్టూ రూ.వేలు వెచ్చించి సోలార్ ఫెన్సింగ్ వేసుకుంటున్నారు.
జనగామ పట్టణ జనాభా 52 వేలు కాగా.. కోతుల సంఖ్య 5 వేలకుపైనే. వాటి బాధ తప్పిస్తానంటూ గత మున్సిపల్ ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన 14వ వార్డు కౌన్సెలర్ పేర్ని స్వరూప రూ.2 లక్షలు ఖర్చు చేసి మరీ.. వాటిని పట్టించి అడవికి తరలించారు. సమస్య తీవ్రత నేపథ్యంలో అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కోతులను పట్టుకుని అడవుల్లో వదలాలంటే గతంలో చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. తాజాగా ఈ అధికారాన్ని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రీజనల్‌స్థాయి అధికారులకూ బదలాయించింది.
మచ్చుకు కొన్ని..
* జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో 54 వేల ఎకరాలకుగాను కూరగాయలు సాగయ్యేది 200 ఎకరాల్లోనే. ఏదులగూడెంలో కూరగాయలు సాగుచేసే కుటుంబాలు గతంలో 100 ఉండగా.. ఇప్పుడు ఒకట్రెండుకు పరిమితమయ్యాయి. ఇదే జిల్లాలో వందల సంఖ్యలో వచ్చే కోతులతో వేగలేమని జీతగాళ్లు చెప్పడంతో.. ఓ రైతు పొలంలోని 18 చెట్లనూ కొట్టించాడు. జఫర్‌గఢ్‌లో 3వేలకుపైగా కోతులుండగా.. ఇంటికొకరు చొప్పున బాధితులున్నారు. కోతులను పట్టి అడవిలో వదిలేసేందుకు ఇంటికి రూ.200 చొప్పున జమ చేసినా సమస్య పరిష్కారం కాలేదు.
* కోతుల దాడిలో 2 నెలల వ్యవధిలో 24 మంది గాయపడి.. దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు.
* సూర్యాపేట జిల్లాలో గతంలో ఖరీఫ్‌లో పెసర, కంది, నువ్వులు, వేరుసెనగ సాగయ్యేవి. కోతుల బెడదతో ఆ పంటలను దాదాపు వేయడం లేదు. పండ్ల తోటలకు కుక్కలను రైతులు కాపలా పెట్టుకుంటున్నారు.
* రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లిలో పాఠశాల తరగతి గదుల్లోకి కోతులు చొరబడటమే కాదు.. విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనాన్నీ లాక్కెళ్లిపోతున్నాయి.
సమస్య తగ్గాలంటే..
కోతుల నివరణకు అటవీ, వ్యవసాయ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ కమిటీ ఇటీవల ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సంతాన నిరోధకశస్త్రచికిత్సలు, హరితహారంలో పండ్ల మొక్కలు నాటడం.. ఇందులోని ప్రధాన సూచనలు.
దీర్ఘకాలిక చర్యలు:సంతాన నిరోధక శస్త్రచికిత్సలు పెంచాలి. ఇందుకు రూ.15.40 కోట్ల ఖర్చవుతుందని అంచనా. హైదరాబాద్ మినహా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని వెటర్నరీ ఆసుపత్రుల్లో ఆడ కోతులకు స్టెరిలైజేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మగ కోతుల శస్త్రచికిత్సకు 32 జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు.
స్వల్పకాలిక చర్యలు:పంట పొలాల చుట్టూ నైలాన్ నెట్లను ఉపయోగించాలి. ఇందుకు ఎకరాకు రూ.6 వేల ఖర్చు కాగా.. 70-80 శాతం ప్రయోజనం చేకూరుతుంది. 4,5 ఎకరాలకు ఒకటి చొప్పున శబ్దాలు చేసే పరికరాలు వాడాలి. ధర రూ.3 వేలపైనే. 5-7 ఎకరాలు ఒక యూనిట్‌గా పొలాల చుట్టూ సోలార్ కంచెలు ఏర్పాటు చేయాలి. దీనికి సుమారు రూ.13 వేల వ్యయం కాగా.. 70-90 శాతం ప్రయోజనం కలుగుతుంది.
హిమాచల్‌లో ఇలా..