Tatikonda MLA Rajaiah attacked by honey bees: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో ఇవాళ జరిగిన రేణుక ఎల్లమ్మ బోనాల పండుగలో అపశృతి చోటుచేసుకొంది. గ్రామంలోని గౌడ కులస్థుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బోనాల పండగకు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. స్థానిక మహిళలు ఆయనకు బోనం ఎత్తి పూజలు నిర్వహిస్తుండగా.. దగ్గర్లో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా కదిలాయి.
అవి అక్కడున్న భక్తులపై దాడి చేయడంతో జనాలు పరుగులు తీశారు. అప్రమత్తమైన ఎమ్మెల్యే వ్యక్తి గత సిబ్బంది రాజయ్యను సురక్షితంగా వాహనంలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి ఆయన వెళ్లిపోయారు. తేనెటీగల దాడితో స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. యువకులు కొందరు ధైర్యం చేసి చిన్నపిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొందరికి గాయాలు కాగా వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్థులందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ వేడుకల్లో ఈ ఘటన జరగడంతో గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
MLA Rajaiah Sarpanch Navya Issue: ఎమ్మెల్యే రాజయ్యపై జానకీపురం సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలు తీవ్ర దూమరం లేపిన విషయం తెలిసిందే.. ఎమ్మెల్యే తనను లైగికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ ఊరికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఈ విషయం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానంటూ పేర్కొన్నారు. మొదట ఆమె ఆరోపణలను ఖండించిన రాజయ్య అధిష్ఠానం ఆదేశాలు మేరకు వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం జానకీపురం వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను కలిశారు.
నవ్య భర్త ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని పేర్కొన్న ఆయన.. పార్టీ అధిష్ఠానం తనకు పలు సూచనలు చేసిందని చెప్పుకొచ్చారు. తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని రాజయ్య వివరణ ఇచ్చారు. తాను ఏ ఊరి పట్ల వివక్ష చూపలేదని పేర్కొన్న ఆయన.. మహిళలు వారి హక్కులు సాధించుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే జనాకీపురం గ్రామానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని రాజయ్య ప్రకటించారు.
అనంతరం మాట్లాడిన సర్పంచ్ నవ్య.. చెడును తాను కచ్చితంగా ఖండిస్తానని పేర్కొన్నారు. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యమని తెలిపారు. రాజయ్య వల్లే తాను సర్పంచ్‌ను అయ్యాయని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండొద్దని పేర్కొన్నారు.