జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ రోజురోజుకు విస్తరించడం.. ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడటం వల్ల ప్రజలు, కార్యకర్తలెవరూ ప్రజా ప్రతినిధులను నేరుగా కలవద్దని సూచించారు. ఏదైనా పని ఉంటే ఫోన్ చేసి మాట్లాడాలని.. నేరుగా కలవకుండానే.. పని పూర్తి చేసుకోవాలని అన్నారు.
‘నేరుగా కలవొద్దు.. ఫోన్ చేయండి’: ఎమ్మెల్యే రాజయ్య - జనగామ జిల్లా వార్తలు
పలు పనుల నిమిత్తం ప్రజలు, కార్యకర్తలు, ప్రతినిధులు, నాయకులు ఎవరూ నేరుగా తనను కలవడానికి రావద్దని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రోజురోజుకు కరోనా విస్తరిస్తున్నందు వల్ల ప్రజలు వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. వైరస్ వేగంగా విస్తరించకుండా వీలైనంత వరకు స్వీయ నియంత్రణ పాటించి ఇంట్లోనే ఉండాలని.. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల రక్షణ కోసమే ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన చెప్పినట్టుగా వినడం మన బాధ్యత అని ఆయన అన్నారు.
ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!