రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉన్నతికి తెరాస ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వంగాల పల్లి గ్రామంలో పది రోజులుగా వరంగల్ క్రికెట్ గ్రౌండ్లో 24 జిల్లాల అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. నల్గొండ, సూర్యాపేట జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ని ప్రారంభించారు. అనంతరం విజయం సాధించిన నల్లగొండ జట్టుకు, ఇతర జట్లకు బహుమతులను అందజేసి అభినందించారు.
తెలంగాణ పేరు నిలబెట్టాలి:
క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందజేస్తోందని.. అన్ని పోటీల్లో పాల్గొని తెలంగాణ పేరు నిలబెట్టాల్సిన బాధ్యత వారిపై ఉందని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చేందుకు కాకతీయ విజయ చందర్ 2020 అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తనకు క్రికెట్ ఆడడం రాదని.. చూడడమంటే ఎంతో ఇష్టమని మంత్రి తెలిపారు. చిన్ననాటి నుంచి వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్ ఆటల్లో మంచి ప్రావీణ్యం ఉందని.. గతంలో శాసన సభ్యులకు క్రీడాపోటీలు నిర్వహిస్తే అత్యధిక బహుమతులు తన టీమ్‌కే వచ్చేవని గుర్తు చేసుకున్నారు.