సీఎం కేసీఆర్ నాయకత్వంలో.. రాష్ట్రం, అన్ని రంగాల్లో ముందజలో నిలుస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. చర్చల పేరిట చీటికిమాటికి ఆలయాలకు రమ్మంటూ సవాల్ చేయడం భాజపా నేతలకు అలవాటుగా మారిందన్నారు. వారితో చర్చించే సమయం.. తమకు లేదని స్పష్టం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
80 శాతం హామీలను నేరవేర్చాం:
తెరాస ప్రభుత్వం.. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 80 శాతం హామీలను నెరవేర్చిందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1, 32, 899 ఉద్యోగాలను భర్తీ చేశామన్న మంత్రి.. రాబోయే మూడేళ్లలో మరో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను సిద్ధం చేశామని వెల్లడించారు.
కేంద్రం.. మేనిఫెస్టోతో మోసం చేసింది:
కేంద్రం.. ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, నిరుద్యోగులను మోసం చేసిందని ఎర్రబెల్లి మండిపడ్డారు. ఇందన ధరలను తగ్గిస్తామని చెప్పి.. రికార్డు స్థాయిలో ధరలు పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల ధనం వెలికి తీసి వందరోజుల్లో ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పిన మోదీ.. ఎవరికైనా వేశారా అని నిలదీశారు. తాము చేసిన అభివృద్ధిని బహిర్గతం చేశామన్న మంత్రి.. కేంద్రం చేసిన అభివృద్ధిని మీడియా ఎదుట ఆధారాలతో చూపాలని డిమాండ్ చేశారు.
రైతులతో ఆటలాడుతోంది..
వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా నూతన చట్టాలను తీసుకొచ్చి.. కేంద్రం, రైతుల నడ్డి విరిచే ప్రయత్నాలు చేస్తోందని మంత్రి ఆరోపించారు. అన్నదాతల నిరసనలపై.. భాజపా కనీసం స్పందించడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఐటీఐఆర్ విషయంలో భాజపా క్షమాపణ చెప్పాలి: కేటీఆర్