తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ బందోబస్తు మధ్య ముగిసిన ప్రీతి అంత్యక్రియలు.. విషాదంలో గ్రామస్థులు - గిర్నితండాలో ముగిసిన ప్రీతి అంత్యక్రియలు

Medical Student Preethi Funeral Ended In Janagam: మారుమూలతండాలో తొలిసారి డాక్టర్‌ చదివిన ఓ బిడ్డ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. సాధించాలనే ఆమె పట్టుదల.. సంకల్పం, ప్రశ్నించే తెగువతో జీవితంలో ఎంతో రాణిస్తూ వస్తున్న ఆ గిరిజన యువతి.. సమాజంలోని పరిస్థితుల ముందు మాత్రం నెగ్గలేకపోయింది. ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి కుమార్తెను ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న ఆ తండ్రి కల అంతలోనే చెదిరిపోయింది. భావితరాలకు భరోసానిచ్చే వైద్యురాలిగా వస్తుందనుకున్న బిడ్డ.. విగతజీవిగా రావటాన్ని చూసి ఆ తండా విలవిల్లాడింది. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, తనువుచాలించిన వైద్యవిద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు ముగిశాయి.

preethi
preethi

By

Published : Feb 27, 2023, 2:27 PM IST

Updated : Feb 27, 2023, 2:52 PM IST

భారీ బందోబస్తు మధ్య ముగిసిన ప్రీతి అంత్యక్రియలు.. విషాదంలో గ్రామస్థులు

Medical Student Preethi Funeral Ended In Janagam: ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన విద్యా కుసుమం ప్రీతి.. అర్థాంతరంగా అందరికీ దూరమైంది. వైద్యులు ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమమని పరిస్ధితి చెబుతున్నా.. ఎక్కడో ఓ చిన్న ఆశ. ఆమె మృత్యుముఖం నుంచి బయటకు వస్తుందని.. మృత్యుఒడిలోనుంచి బయటకు రావాలని అంతా ఆశించారు. కన్నబిడ్డలాగే భావించి.. క్షేమంగా తిరిగిరావాలని అంతా ప్రార్థించారు. నిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచి.. శాశ్వతంగా ఈలోకం విడిచిపెట్టి వెళ్లిపోయింది. కన్నవారికి, కుటుంబసభ్యులకు తీరని ఆవేదనను మిగిల్చి వెళ్లిపోయింది. ఈ రోజు ప్రీతి అంత్యక్రియలు గ్రామస్థులందరి మధ్య ప్రశాంతంగా జరిగాయి.

ప్రీతి మృతిచెందారని వైద్యులు ప్రకటించటంతో రాత్రి నిమ్స్‌ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శవపరీక్ష పూర్తైన తర్వాత భద్రత నడుమ కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు చేర్చారు. మృతదేహం వద్ద ప్రీతి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎన్నో ఆశలతో వెళ్లిన అమ్మాయి.. విగతజీవిగా రావటాన్ని చూసి గ్రామస్థులు తల్లడిల్లిపోయారు.

తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదు. హత్యేనని, ప్రీతి తండ్రి నరేందర్‌ ఆరోపించారు. బిడ్డ మృతితో శోకసంద్రంలో ఉన్న ఆయన.. ప్రీతికి ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారన్నారని.. అదే కోణంలో పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్​ కాలేజ్​ అనస్థీషియా విభాగం హెచ్​వోడీని సస్పెండ్​ చేయాలన్నారు. ఆ తర్వాతనే సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని ప్రీతి తండ్రి నరేందర్​ కోరారు.

తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదు

"అరెస్ట్​ చేశారు. చప్పుడు కాకుండా కూర్చుకున్నారు. తక్షణం శిక్ష అమలు చేయాలని కోరుతున్నాను. సమాజానికి ఒక సందేశం పంపాలని కోరుతున్నాను. ఇంకొకరు ప్రీతిలాగా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకుని చదివింది. మా కుటుంబంలో ఇప్పటివరకు ఎవరూ డాక్టర్​ చదవలేదు. ఆమె ఆశలు అన్ని అడియాశలు అయ్యాయి." - నరేందర్​, ప్రీతి తండ్రి

"పిల్లలను బాగా చదివించాడు. ప్రీతి గ్రామంలోకి పండగలకు, శుభకార్యాలకు వస్తే అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి.. మనం చదువుకుంటేనే భవిష్యత్తులో ఉన్నతస్థానాలు అందుకుంటాము అని చెప్పేది. మా ప్రాంతంలో మొట్టమొదటి డాక్టర్​ ప్రీతి. ఉన్నతస్థానంలో ప్రీతిని చూస్తాము అనుకున్నాము. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు మాకు ఒక ఆశ ఉండేది. ఎలాగైనా తిరిగి వస్తుందనుకున్నాము."- స్థానికులు, గిర్నితండా

ఇవీ చదవండి:

Last Updated : Feb 27, 2023, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details