Lease farmers: మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా తయారైంది రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, రవాణా తదితర ఖర్చులు పెరిగిన తరుణంలో భూ యజమానులు కౌలు ధరలూ పెంచుతుండటం వారిపాలిట అశనిపాతంలా మారింది. దీంతో పంటల సాగు వ్యయం మరింత భారమైందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న భూముల(పత్తి, మిరప వంటి పంటల)కు కొన్ని ప్రాంతాల్లో ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా కౌలు వసూలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు తదితర జిల్లాల్లో గోదావరి నదీ తీర ప్రాంతాల్లో నల్లరేగడి భూములకు రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా అడుగుతున్నారు. రాష్ట్రంలో మొత్తం కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీటిలో మూడో వంతు కౌలు విధానంలో సాగవుతున్నాయి. నిరుపేదలు, వ్యవసాయ కూలీలే ఎక్కువగా కౌలుకు సాగుచేస్తున్నారు. వీరు దాదాపు 15 లక్షల మంది ఉన్నట్లు రైతుసంఘాల అంచనా. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు, సాయం, ప్రోత్సాహకాలు, చివరికి పంటరుణాలూ దక్కడంలేదు. అకాల వర్షాలు, అధిక ఎండలు, తెగుళ్లబారి నుంచి పంటను చివరికి ఎలాగోలా కాపాడుకున్నా అంతంతమాత్రం వచ్చే దిగుబడులతో కౌలు, పంట సాగుఖర్చులు, అప్పులు, వడ్డీలకు కట్టేసరికి ఏమీ మిగలడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలో పంట పండినా పండకున్నా ముందే కౌలు డబ్బులు చెల్లించాల్సి వస్తున్నందున పంటలు దెబ్బతింటే అప్పుల పాలై కొందరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
జేఎల్‌జీలకు పంట రుణాలే లేవు
కౌలు రైతుల పేరుతో భూమి ఉండదని, వారిని 5 నుంచి 10 మందిని ‘సంయుక్త భాగస్వామ్య సంఘం’(జేఎల్‌జీ)గా ఏర్పాటు చేసి పంటరుణాలు సంయుక్త పూచీకత్తు కింద ఇవ్వాలని రిజర్వుబ్యాంకు, నాబార్డు గతంలో అన్ని బ్యాంకులకు సూచించాయి. కానీ రాష్ట్రంలో ఈ సంఘాల ఏర్పాటు, పంటరుణాల పంపిణీ లేవు. గతేడాది రాష్ట్రంలో రూ.53 వేల కోట్ల పంటరుణాల పంపిణీలో పట్టుమని 5 శాతం కూడా కౌలు రైతులకు ఇవ్వలేదు. తమ బ్యాంకు పరిధిలో జేఎల్‌జీలకు పంటరుణాలేమీ ఇవ్వలేదని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఓ బ్యాంకు మేనేజర్ ‘ఈనాడు’కు స్పష్టం చేశారు.
- భూమి పట్టాదారు పాసుపుస్తకం ఉంటేనే రైతుబంధు, రైతుబీమా అనే నిబంధన కారణంగా కౌలు రైతులకు ఈ ప్రయోజనాలు అందడంలేదు.
- పంటలు దెబ్బతిని గిట్టుబాటు ధర లభించక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో సగానికి పైగా కౌలురైతులే ఉంటున్నారని రైతు స్వరాజ్య వేదిక అధ్యయనంలో తేలింది.
సాగు వీరిది... పేరు వారిది..
రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ బుకింగ్ పోర్టల్ వ్యవస్థ నేపథ్యంలో భూ యజమానుల పేరిటే పంటల వివరాలను ‘వ్యవసాయ విస్తరణ అధికారులు’(ఏఈఓ) నమోదు చేస్తున్నారు. దీంతో మద్దతు ధరకు ప్రభుత్వం పంటలను కొనుగోలు చేసేటప్పుడు భూ యజమానుల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కొందరు తమ ఖాతాల్లో పడిన పంట డబ్బుల నుంచి కౌలు సొమ్మును ముందుగా మినహాయించుకుని తరవాతే కౌలు రైతులకు మిగిలిన సొమ్మును చెల్లిస్తున్నారు. గతంలో మెదక్ జిల్లా నవాబ్‌పేట గ్రామంలో మొక్క జొన్న పంటను కౌలురైతు విక్రయిస్తే భూ యజమని బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం పంట సొమ్ము జమ చేసింది. ఎకరాకు రూ.5వేలు తనకు అదనంగా ఇస్తేనే తన బ్యాంకు ఖాతా నుంచి డబ్బు డ్రా చేసి ఇస్తానని యజమాని కౌలు రైతును ఇబ్బంది పెట్టారు.
ఎకరానికి రూ.20 వేలు అడుగుతున్నారు
ఎకరం పావు భూమిని కౌలుకు తీసుకుని గత నాలుగేళ్లుగా సాగుచేస్తున్నాను. ఎకరానికి ఏడాదికి 3 క్వింటాళ్ల సన్న బియ్యం కౌలు కింద ఇవ్వాలని ఒప్పందంతో ఈ భూమిని యజమాని నాకు ఇచ్చారు. ఈ వానాకాలం నుంచి ఏడాదికి రూ.20 వేల చొప్పున నగదు రూపంలో సాగుకు ముందే కౌలు కింద ఇవ్వమంటున్నారు. దీంతో సాగు చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను. కౌలుతో పాటు ఇతర ఖర్చులూ పెరగడంతో ఏం తోచడంలేదు.
- రాజ్యం పెంటయ్య, కౌలు రైతు, చండి, శివ్వంపేట మండలం, మెదక్ జిల్లా