జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ, తానేదార్పల్లి గ్రామాల్లో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి ,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరకులను అందజేశారు.
అభివృద్ధి చేద్దామంటే రాజకీయాలెందుకు..?: కడియం - kadiyam srihari latest news
తనకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ను అభివృద్ధి చేద్దామంటే రాజకీయాలు చేస్తూ అడ్డుకుంటున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న వారికి చేతనైతే సహాయం చేయాలి... చేతకాకపోతే చేసిన వ్యక్తులను చూసి సంతోషించాలి అన్నారు. మల్లన్న గండి కుడి కాలువ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి... రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తానని కడియం హామీ ఇచ్చారు.
మల్లన్న గండి కుడి కాలువ పనులు పూర్తి చేయడం వలన 7 గ్రామాలకు చెందిన రైతులకు లబ్ధి చేకూరుతుందని కడియం తెలిపారు. గతంలో తాను నీటిపారుదల శాఖమంత్రిగా ఉన్న 2003లోనే దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఆనాడు దేవాదుల ప్రాజెక్టుతో స్టేషన్ ఘనపూర్ ఒరిగింది ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారన్నారు. కానీ నేడు దేవాదుల నీరే నియోజకవర్గ ప్రజలకు దిక్కయిందని పేర్కొన్నారు.
నీవు పనిమంతుడు కాదు, సహాయం చేయవు... నీవు పది మందికి సహాయం చేస్తే ప్రజలు మరో నాయకుడి దగ్గరకు పోరు కదా అనే విషయాన్ని గమనించాలని పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించి కడియం శ్రీహరి విమర్శించారు.