Kadiam Srihari reaction on MLA Rajaiah allegations : స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రాజయ్య తీరు, ఆరోపణలపై తాజాగా కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజయ్య పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని.. అయినప్పటికీ తొందరపడొద్దని పార్టీ పెద్దలు తనకు సూచించినట్లు కడియం పేర్కొన్నారు. వాస్తవం చెప్పకపోతే ప్రజలు తనను అపార్థం చేసుకుంటారని అసలు విషయం చెబుతున్నానన్నారు. తాటికొండ రాజయ్య వైద్యుడు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని కడియం ఆక్షేపించారు.
Kadiam Srihari vs Thatikonda Rajaiah : తన కులం, ఆస్తులు, ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధిపై తాటికొండ రాజయ్య అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమాఅని రాజయ్యకు సవాల్ విసిరారు. తన అవినీతిని నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానన్న కడియం.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గులాబీ పార్టీ విజయానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
'రాజయ్య పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారని పెద్దలు చెప్పారు. వాస్తవం చెప్పకపోతే ప్రజలు నన్ను అపార్థం చేసుకుంటారని అసలు విషయం చెప్తున్నా. రాజయ్య వైద్యుడై ఉండి.. సభ్యత లేకుండా మాట్లాడారు. నా తల్లి కులం, నా కులం గురించి కూడా మాట్లాడటం దారుణం. పిల్లలకు తల్లి కులం కాకుండా తండ్రి కులమే వస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. తల్లి మాత్రమే సత్యం, తండ్రి అనేది అపోహ అని దారుణంగా మాట్లాడారు. సమాజంలోని ప్రతి తల్లిని అవమానించేలా రాజయ్య మాట్లాడారు. రాజయ్య ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నా అవినీతిని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పార్టీ విజయానికి కృషి చేస్తా.' -ఎమ్మెల్సీ కడియం శ్రీహరి