జనగామ జిల్లా పెంబర్తి హస్త కళాకారుల నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న ఈ గ్రామ కళాకారుల ఖ్యాతి ఇప్పటికే దేశం నలుమూలలా వ్యాపించింది. విదేశాల్లోనూ పెంబర్తి కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఇంట్లోనూ.. ఆలయాల్లోనూ ఉండే దేవుని ప్రతిమలనే సర్వాంతర్యామిగా.. పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. ఆ దేవుని రూపాలు తయారు చేయడంలో పెంబర్తి కళాకారులు సిద్ధహస్తులు. వేములవాడ రాజన్న కోవెలలో వెండి ద్వారాలు, బాసర సరస్వతీ దేవి విగ్రహం.. శ్రీకాళహస్తి ఆలయ ధ్వజస్తంభానికి గల తొడుగ వీరు రూపొందించిందే.
యాదాద్రీశుని సేవలో..
ఇకపై పెంబర్తి కళాకారులు యాదాద్రీశుని సేవలో తరించనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలు కూడా వీరి చేతుల్లోనే రూపుదిద్దుకుంటున్నాయి. యాదాద్రి పునర్నిర్మాణ ఆలయంలో పెంబర్తి హస్తకళ వైభవం దశదిశలా వ్యాపించనుంది. ఈ మేరకు కళాకారులతో స్వయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గర్భాలయం ప్రధాన ద్వారాలకు వెండి, బంగారు తాపడాలు, గర్భాలయం లోపల మూర్తులకు వెండి తొడుగులు, ప్రాకారం చుట్టూ రెయిలింగ్, రాజగోపురంపై ఇత్తడి రాగితో శంఖుచక్రాలు, పద్మాల నిర్మాణ పనులు వీరికి అప్పగించారు. తమకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి.. తెలంగాణ, పెంబర్తి ఖ్యాతిని మరింత ఇనుమడింపచేసేలా.. పనిచేస్తామని తెలిపారు.