farmers protest in jangaon : జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని జాతీయ రహదారిపై ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వరి ధాన్యాన్ని తగులబెట్టి ధర్నా చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ మిల్లర్లు అదనంగా తరుగు పేరుతో రైతులను దోచుకుంటూ క్వింటాలుకు ఐదు కిలోలు తీస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం బస్తాకు 41 కిలోలు జోకాలని చెప్పినప్పటికీ మిల్లర్లు 42 కిలోలు ఉంటేనే తీసుకుంటామని చెప్పడంతో రైతులు ఆవేదనతో జాతీయ రహదారిపై వారు పండించిన వరి ధాన్యాన్ని తగలబెట్టారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం చెప్పినప్పటికీ: స్టేషన్ ఘన్పూర్ ఐకేపీ సెంటర్లో గత 15 రోజుల నుంచి రైతులు వరి ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాడి మిషన్తో ధాన్యాన్ని తూర్పారబెట్టారు. మ్యాచర్ సరిగా వచ్చినా.. మిల్లర్లు కొనుగోలు విషయంలో జాప్యం చేస్తున్నారని, రైతులు అంటున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పండిన పంట అమ్ముకోవడానికి మధ్య దళారులు, మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ, అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని వారు ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్, మంత్రి స్పందించి ప్రభుత్వ నిబంధన మేరకు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరారు.