తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలకలం - telangana varthalu

జనగామ జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లా కలెక్టరేట్‌ నుంచి మొదలుకొని పోలీస్‌, వైద్య ఆరోగ్య శాఖలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ఉద్యోగులు కొవిడ్‌ బారినపడుతున్నారు. విధి నిర్వహణలో పనులు చేయాల్సి రావడం... కార్యాలయాలకు సందర్శకులు రావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలకలం
ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కలకలం

By

Published : Apr 24, 2021, 4:37 PM IST

జనగామ జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. రోజుకు కనీసం జిల్లా వ్యాప్తంగా 250 పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం ఏకంగా జిల్లా వ్యాప్తంగా 300కుపైగా నమోదయ్యాయి. జిల్లా కలెక్టరేట్‌ నుంచి మొదలుకొని పోలీస్‌, వైద్య ఆరోగ్య శాఖలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో ఉద్యోగులు కొవిడ్‌ బారినపడుతున్నారు. విధి నిర్వహణలో పనులు చేయాల్సి రావడం... కార్యాలయాలకు సందర్శకులు రావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వారం రోజులుగా జిల్లా ఆసుపత్రిలో పలువురు సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది.

వైద్య సిబ్బంది సైతం....

జిల్లా ఆసుపత్రికి రోజూ వందల సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి, టీకాలు తీసుకోవడానికి ప్రజలు తరలివస్తుండడంతో సేవలందించే వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సేవల విషయంలో కూడా ప్రతిష్టంభన ఏర్పడే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా జనగామ రైల్వేస్టేషన్‌లో ఇద్దరు సిబ్బంది, జనగామ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఓ ఉద్యోగి మహమ్మారి బారిన పడ్డారు. ఆ కార్యాలయంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. జిల్లా పరిధిలోని 16 పీహెచ్‌సీల పరిధిలో సేవలందించే వైద్య సిబ్బంది కూడా వైరస్‌ బారినపడుతున్నారు. వ్యాప్తి పెరిగిపోతుండడంతో కలెక్టరేట్‌ నుంచి మొదలుకుని జిల్లా కేంద్రంలో ఉండే దాదాపు 40 శాఖల కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది మరింత పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందర్శకుల నుంచి దూరం నుంచే వినతులు తీసుకోవడం, సమస్యలు వినడం చేస్తున్నారు.

కోర్టులో ఆన్‌లైన్‌లోనే కేసుల విచారణ...

జనగామ కోర్టులో కూడా ఓ ఉద్యోగి కరోనా బారినపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి 50 శాతం సిబ్బంది మాత్రమే కోర్టుకు హాజరవుతున్నారు. న్యాయవాదులు కోర్టుకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లో కేసులు వాదిస్తున్నారు. కోర్టు హాల్‌లో ఆన్‌లైన్‌లో కేసుల ప్రక్రియ పర్యవేక్షించడానికి ఇద్దరు న్యాయవాదులు మాత్రం అందుబాటులో ఉంటున్నారు. కోర్టులో న్యాయమూర్తులు వారం రోజులుగా ఆన్‌లైన్‌తోనే కేసులు విచారిస్తుండడం గమనార్హం. కరోనా వ్యాప్తి పెరిగిపోతుండడంతోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జనగామ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూరెళ్ల శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఇక నిత్యం బందోబస్తు, శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులను కూడా విధి నిర్వహణలో వైరస్‌ భయం వెంటాడుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా పలు ఠాణాల్లో సిబ్బంది కొవిడ్‌ బారినపడుతున్నారు.

రెండో దశలో వేగంగా విస్తరణ..

వైరస్‌ ప్రభావం రెండో దశలో చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్రజలు మాస్కులు ధరించాలి. భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతేనే బయటకు రావాలి. మే నెల వరకు వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఉద్యోగులు, సిబ్బంది కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్దేశించిన వయసుల వారంతా టీకాలు తీసుకోవాలి. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్ధు.

- డాక్టర్‌ మహేందర్‌, జిల్లా వైద్యాధికారి

ఇదీ చదవండి:రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సినేషన్‌: సీఎం కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details