CM KCR Jangaon Tour: జనగామ జిల్లాకు భవిష్యత్‌లో కరువు రాకుండా చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఒకనాడు కరువు ప్రాంతంగా పేరొందిన జనగామను పూర్తిగా సస్యశ్యామలం చేశామని చెప్పారు. మారుమూల నియోజకవర్గాలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమన్న కేసీఆర్.... రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని వెల్లడించారు.
ఒకప్పుడు జనగామను చూస్తే.. కన్నీళ్లు వచ్చేవి...
ఏడేళ్లల్లో జనగామ జిల్లా అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 25 ఎకరాల్లో 58.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ఆయన ప్రారంభించారు. అందరి అనుమానాలు పటాపంచలు చేసి అభివృద్ధి సాధించామని వెల్లడించారు. ఈ సమయంలో ప్రొ.జయశంకర్ లేకపోవటం బాధాకరమన్నారు. ఒకప్పుడు జనగామ జిల్లా పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని గుర్తు చేసుకున్నారు. గోదావరి ఉద్ధృతంగా పారే జిల్లాలో నీటి కొరత చూసి ఎంతో బాధపడ్డానని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసుకుని జిల్లాలకు నీళ్లు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. జనగామ జిల్లా ప్రజాప్రతినిధులు నాతో కొట్లాడి నిధులు సాధించుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఇవాళ పౌరసరఫరాల శాఖ కొనలేనంత ధాన్యం దిగుబడి వస్తోంది. రూ.2 లక్షలు ఉండే ఎకరం భూమి విలువ రూ.2 కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగుల కృషి వల్లే తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా మన కలెక్టరేట్ల స్థాయిలో కూడా లేవు. గ్రామీణ విభాగంలో కేంద్రం 10 అవార్డులు ఇస్తే... 7 తెలంగాణకే వచ్చాయి.
-- ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేందుకు సిద్ధం
ఎంతో ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని కేసీఆర్ ఉద్ఘాటించారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు కొందరు ఇష్టపడట్లేదన్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను నెరవేర్చాలన్నారు. మన ప్రజల తలసరి ఆదాయం త్వరలో రూ.2.70 లక్షలు కానుందని స్పష్టం చేశారు. సదుపాయాలు బాగున్నందునే అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని వివరించారు.
ఎందరో హైకోర్టు జడ్జిలు హైదరాబాద్‌లోనే స్థిరపడుతున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో రూ.30 కోట్లతో విల్లాలు కొంటున్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల చేతికే నిధులు వెళ్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల అమలు నిమిషాల్లోనే చేయగలుగుతున్నామని అధికారులు అంటున్నారు. ఏడాది కాలంలోనే 2,600 రైతు వేదికలు నిర్మించాం. భవిష్యత్‌లో ఎవరూ ఊహించని అభివృద్ధిని చూస్తాం.
-- ముఖ్యమంత్రి కేసీఆర్
అనంతరం జనగామ జిల్లా యశ్వంతపూర్ వద్ద తెరాస కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జిల్లా తెరాస కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. రెండెకరాల్లో విశాలంగా తెరాస జిల్లా కార్యాలయం నిర్మాణం జరిగింది. ఇకపై తెరాస కార్యాలయంలోనే సభలు, సమావేశాలు, శిక్షణ శిబిరాలు కొనసాగనున్నాయి. తెరాస కార్యాలయంలో సమావేశమందిరం, ప్రత్యేక విశ్రాంతి గదులు, క్యాంటీన్ వసతులు కలవు. ఇన్నాళ్లూ అద్దె భవనంలో తెరాస కార్యాలయం కొనసాగింది. ఇకపై సొంత భవనంలో తెరాస కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
ఇదీ చూడండి :Tollywood drugs case Update : మరోసారి తెరపైకి టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసు