కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రయోగాత్మక సర్వే నిర్వహిస్తోంది. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వైద్య బృందాలు.. గ్రీన్, ఆరేంజ్ జోన్లలో సిరో ప్రొవిలెన్స్ సర్వే చేపట్టాయి. తొలివిడతలో రాష్ట్రంలోని నల్గొండ, కామారెడ్డి, జనగామ జిల్లాలో ర్యాండమ్ పద్ధతిలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నాయి. సర్వే కోసం జిల్లాకు 5బృందాల చొప్పున మొత్తం 15బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లా నుంచి 400నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపనున్నారు. ఈ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో కరోనా ప్రభావాన్ని అంచనా వేసి తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం.. మరిన్ని వ్యూహాలు రూపొందించే అవకాశముంది.
యాంటీ బాడీస్ పరీక్షల ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల ఐసీఎంఆర్ ఎలీజా టెస్ట్‌ల వైపు మొగ్గుచూపుతోంది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు సైతం అందించింది. ఎలీజా పరీక్షల ద్వారా 97శాతానికి పైగా కచ్చితమైన ఫలితం వస్తుందని పేర్కొంది. కమ్యూనిటీ స్థాయిలో ఎంత మంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారనే విషయాన్ని గుర్తించేందుకే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది.