కరోనా కారణంగా మూతపడ్డ విద్యాలయాలు, తెరుచుకోని శిక్షణ కేంద్రాలు, తాళాలు పడ్డ గ్రంథాలయాలతో విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులు తగిన పుస్తకాలు లభ్యంకాక ఇంటి వద్దనే విజ్ఞానార్జనకు అష్టకష్టాలు పడుతున్నారు. వీరితోపాటు నిత్యం రకరకాల పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు పుస్తకాలు లభించక అందుబాటులో ఉన్న వాటినే తిరిగేసి కాలం గడుపుతున్నారు. ఇలాంటి వారందరి కోసం కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ ద్వారా అంతర్జాలం ఆధారంగా ‘జాతీయ డిజిటల్ గ్రంథాలయం’ (ఎన్‌డీఎల్) రూపొందించింది.
కంప్యూటర్‌లో వెబ్‌సైట్‌తోపాటు, చరవాణిలో యాప్ రూపొందించి పాఠశాల విద్యార్థి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండేలా నిక్షిప్తం చేశారు. వీరితోపాటు సివిల్స్, గ్రూప్స్, ఎంసెట్, తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ యాప్ ఉపయుక్తం కానుంది. అవసరమైన పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుకొనే అవకాశముంది.
నాలుగు కోట్లకు పైగా పుస్తకాలు...
దేశవ్యాప్తంగా అందరికీ ఉపయోగంగా ఉండాలనే లక్ష్యంతో తెలుగుతోపాటు 12 భాషల్లో నాలుగు కోట్లకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎంతోమంది మహనీయులు, ప్రముఖుల జీవిత చరిత్రకు చెందిన 3 లక్షల పుస్తకాలతోపాటు, వివిధ బోర్డుల ప్రశ్నాపత్రాలు, కంప్యూటర్ సైన్స్, ఐఐటీ, జేఈఈ, గేట్, ఇంజినీరింగ్, బీఎడ్, డీఎడ్, ఛాత్రోపాధ్యాయుల శిక్షణ, పరిశోధనలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పుస్తకాలతోపాటు సాహితీ, సాంస్కృతిక, కళారంగాలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక రకంగా ఇకపై ఏ గ్రంథాలయానికో, పుస్తకాల దుకాణాలకో వెళ్లాల్సిన అవసరంలేకుండా సమయాన్ని వృథా చేసుకోకుండా ఏ సమయంలోనైనా అరచేతిలోనే అవసరమైన విజ్ఞానాన్ని అందుకొనే అవకాశమున్న ఎన్‌డీఎల్ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
నమోదు తప్పనిసరి...
ఎన్‌డీఎల్‌లో పుస్తకాన్వేషణ చేయాలంటే ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ-మెయిల్ ఐడీ సాయంతో వివరాలు నమోదు చేసుకోవాలి. విద్యనభ్యసిస్తున్న విశ్వవిద్యాలయం, అవసరమైన పుస్తకాల జాబితా వివరాలు ఎంపిక చేయాలి. నమోదు చేసిన ఈ-మెయిల్‌కు లింకు అందిన తర్వాత క్లిక్ చేసి లాగిన్, పాస్‌వర్డ్ నమోదు చేసి వెబ్‌సైట్ తెరుచుకొన్న వెంటనే అవసరమైన పుస్తకాలను ఎంపిక చేసుకొని చదువుకోవచ్చు. ఉద్యోగార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ఐచ్ఛికాలను ఎంపిక చేసుకొని అవసరమైన పుస్తకాలను ఎంపిక చేసుకొనే అవకాశముంది.
ఇదీ చదవండి:'రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా ఈటీవీ రజతోత్సవం'