Bandi sanjay padayatra: రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఓ వేద పాఠశాల ఉండాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లాలోని బ్రాహ్మణులతో ఆయన సమావేశమయ్యారు. భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం, నెల్లుట్ల నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. జనగాం టౌన్, నెహ్రూ పార్క్, ఎమ్మార్వో ఆఫీస్ మీదుగా రెడ్డి సంఘం వరకు కొనసాగనుంది.
తెలంగాణ ఆర్థికంగా ధనిక రాష్ట్రమట. మరీ జీతాలు ఎందుకిస్తలేవ్. ధూప దీప నైవేద్యాలు స్కీమ్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. నువ్విచ్చే ఆరు వేలు ఎందుకు సరిపోతాయి. హారతి, కర్పూరం పాకెట్ రేటు ఎంత? మీ వీఐపీలు వస్తేనే ఖర్చయితాయ్ - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ప్రతి జిల్లాలో వేద పాఠశాల కోసం తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ అన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, మీ బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకున్నానని వెల్లడించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటున్న కేసీఆర్.. జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అర్చకులకు రూ.6 వేలు ఇవ్వడానికే కేసీఆర్‌కు దిక్కు లేదా అని నిలదీశారు. పాదయాత్రలో రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు మొత్తం 15 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.