Bandi Sanjay Comments: ఉచిత సంక్షేమ పథకాలపై ప్రధాని వ్యాఖ్యలను తెరాస వక్రీకరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఉచితాలకు వ్యతిరేకం కాదని... ఉచితాల పేరుతో స్కాములు చేయడాన్ని వ్యతిరేకించారనేది సీఎం కేసీఆర్ తెలుసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హితవుపలికారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగించారు. నిన్న దేవరుప్పులలో జరిగిన ఘటనలతో పోలీసులు బండి సంజయ్ యాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
పోలీసులను పెట్టి పాదయాత్రకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు. చట్టాలను కాపాడాలాల్సి సీపీ.. తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉద్యమ ద్రోహుల రాజ్యం నడుస్తోందని, నిజాం రాజుల పాలన సాగిస్తున్న కేసీఆర్‌పై పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు సూచించారు. తెగించి కొట్లాడి కేసీఆర్ గడీ రాజ్యాన్ని బద్దలు కొట్టాలన్నారు. తెలంగాణ విమోచన దినం 17 సెప్టెంబర్‌ను అధికారికంగా నిర్వహించేలా కేసీఆర్ మెడలు వంచుతామన్నారు. సీబీఐ వల్లే కేసీఆర్ చేసిన అవినీతి అందరికీ తెలిసిందన్నారు. పాదయాత్రకు ముందు విస్నూర్‌లో సామూహిక గీతాలాపన కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.