Bhatti Comments in Peoples March Padayatra: ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్ర సంపదను కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేస్తోందని సీఎల్పీ నేత భట్టి ఆరోపించారు. మహిళా ఆర్థిక సాధికారత కోసం.. తాము అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ ప్రజలతో.. ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం తరిగొప్పుల మండలంలో భోజనం అనంతరం మాట్లాడిన భట్టి.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్వహించేది, తనది పార్టీ కార్యక్రమాలే తప్ప పోటీ కార్యక్రమాలు కాదని స్పష్టం చేశారు.
దోచుకున్నది చాలదన్నట్లు దేశం మీద పడుతున్నారు:8 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్, కాళేశ్వరం స్కామ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ స్కామ్‌లను సాధించింది తప్ప ఏమీ లేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఇంత దోపిడీ స్వాతంత్య్ర భారత్‌లో ఏం రాష్ట్రంలో లేదన్న ఆయన.. మిగులు బడ్జెట్ గల రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. 15 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను కాంగ్రెస్ ఏర్పాటు చేసిందన్న భట్టి... రూ.లక్షా 25 వేల కోట్లు ఖర్చు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. ఇక్కడ దోచుకున్నది చాలదన్నట్లు దేశం మీద పడుతున్నారని ఎద్దేవా చేశారు.
'ఔటర్ రింగ్‌రోడ్డు 30 ఏళ్లు లీజ్‌కు ఇవ్వడం దుర్మార్గం. ప్రభుత్వం అందినకాడికి అమ్మకానికి పెడుతుంది. ప్రతి ఎకరాకు నీరు అందుతుందంటే కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే. రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదన్నట్లు దేశం మీద పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ మరో శ్రీలంకగా మారుతుంది. బీఆర్ఎస్, బీజేపీలు కుట్రపూరితంగా రాష్ట్రంపై దాడి చేస్తున్నాయి. 100 సీట్లు గెలుస్తామనే ధైర్యంతో కేసీఆర్ ఉన్నారు. మరి గజ్వేల్‌లో పోటీ చేయాలా వద్దా అని సర్వే ఎందుకు?. నాది, రేవంత్‌రెడ్డిది పార్టీ కార్యక్రమాలే.. పోటీ కార్యక్రమాలు కాదు.'- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత