Bandi fires on CM KCR: దిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎం పదేపదే దిల్లీకి వెళ్లి చేసింది లిక్కర్ స్కామ్ వ్యవహారాలేనని విమర్శించారు. ప్రజాసంగ్రామా యాత్రలో భాగంగా సీఎం కేసీఆర్‌ని ఉద్దేశించి విమర్శలు చేశారు. తెలంగాణలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం 30 వేల కోట్లకు పెరిగిందని...ఈ స్కామ్‌పై సీఎం కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి అన్ని విషయాలు బయటపెడతామని స్పష్టం చేశారు. రామచంద్ర పిళ్లై, శరత్, సృజన్ రెడ్డి, అభిషేక్‌లు కేసీఆర్ బినామీలని బండి సంజయ్ ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలని సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకొస్తాయని ఆయన అన్నారు.
‘‘కేసీఆర్ కుటుంబసభ్యులు దిల్లీలోని ఓ హోటల్‌లో లిక్కర్ మాఫియాకు సంబంధించిన వ్యక్తులను కలిశారా? లేదా? ఆ మాఫియాకు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లారా? లేదా? వారితో కేసీఆర్ కుటుంబసభ్యులకు పరిచయం ఉందా? లేదా? దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ నేతలతో సంబంధం ఉంది. కాంగ్రెస్‌కు కూడా దీనిలో వాటా ఉందనే అనుమానం వస్తుంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తే తప్పకుండా వాస్తవాలు బయటకు వస్తాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించాలి’’ -బండి సంజయ్