తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనగామ జిల్లాలోని వడ్లకొండ వాగులో వరద నీటి ఉద్ధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రమాదంలో పడ్డారు. అయితే, వాగులో ఓ చెట్టుకు ఢీకొని కారు ఆగిపోవడం వల్ల కారు పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూశారు.
వెనక్కి వెళ్లమని చెప్పినా వినలేదు..
జనగామ-హస్నాబాద్ రహదారి మీదుగా వరద నీరు భారీగా ప్రవహించింది. మంగళవారం సాయంత్రం నుంచి రహదారిపై రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు పోలీసులు, అధికారులు సూచించారు. అయితే గ్రామ శివారు సుందరయ్య నగర్‌కు చెందిన ఇద్దరు యువకులు కనుకరాజు, నరేశ్, మరిగడి గ్రామానికి చెందిన రవి, మరో యువకుడు కారులో జనగామ వైపు వస్తున్నారు. వాగు వద్దకు రాగానే గమనించిన పోలీసులు వెనక్కి వెళ్లమని సూచించారు. అది వినకుండా ఆ యువకులు ముందుకు వెళ్లడం వల్ల వరద ప్రవాహానికి ఒక కిలోమీటర్ దూరం కొట్టుకొనిపోయారు. చిట్టకోడూరు జలాశయం సమీపంలో ఓ తాటి చెట్టు ఢీకొనడం వల్ల కారు ఆగిపోయింది.