తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్ష రూపాయలిచ్చినా వేధింపులు ఆపని కులపెద్దలు - 1 lakh fine

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకున్నారు. అంతా బాగానే ఉందనుకుంటుండగా.. కుల పెద్దలు రంగప్రవేశం చేశారు. వేరే కులం వాడితో పెళ్లి చేసుకున్నందుకు అభ్యంతరం తెలిపి జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా కులంలో కలవనీయకుండా వేధింపులకు గురి చేశారు. విసిగిపోయిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

లక్ష రూపాయలిచ్చినా వేధింపులు ఆపని కులపెద్దలు

By

Published : Sep 16, 2019, 6:14 PM IST

Updated : Sep 16, 2019, 10:47 PM IST

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టు నాగారం గ్రామానికి చెందిన వసంత, వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన అనిల్​ గౌడ్​ ఈ యేడు జూన్​ 21న కులాంతర వివాహం చేసుకున్నారు. దీనిపై సర్పంచ్ భర్త​తో పాటు కొంతమంది కులపెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా జూన్​ 27న పంచాయితీ పెట్టి.. వసంత కుటుంబానికి లక్ష రూపాయలు, వివాహానికి హాజరైన ఆరుగురు బంధువులకు 5వేల రూపాయలు, కురుమ కుల పెద్దకు 20 వేలు జరిమానా విధించారు.

వసంత తండ్రి జులై 1న 50 వేలు, ఆగస్టు 27న మరో 50 వేలు చెల్లించాడు. అయినా తరచూ తన తల్లిదండ్రులను వేధిస్తున్నారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం నాడు కులస్థులంతా వనభోజనాలకు వెళ్లగా... తమ కుటుంబాన్ని ఆహ్వానించకుండా... కుల బహిష్కరణ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తమ కుటుంబంపై కులపెద్దలు వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

ఘటనపై విచారణ జరిపి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తహసీల్దార్​ ముందు బైండోవర్​ చేసి సొంతపూచికత్తుపై విడుదల చేసినట్లు నర్మెట్ట సీఐ సంతోష్​ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లక్ష రూపాయలిచ్చినా వేధింపులు ఆపని కులపెద్దలు

ఇదీ చూడండి: గాంధీ ఆస్పత్రిని సందర్శించిన "అఖిలపక్షం" నేతలు

Last Updated : Sep 16, 2019, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details