Young Man Murder in Beerpur Jagtial : వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. నువ్వు లేక నేను లేను అనేంతలా ప్రేమించుకున్నారు. మూడు ముళ్లతో ఒక్కటై.. నాలుగు కాలాల పాటు హాయిగా బతకాలనుకున్నారు. విషయం యువతి ఇంట్లో తెలియడంతో హెచ్చరించారు. ఎంతకూ వినకపోవడంతో యువతికి మరో వ్యక్తితో వివాహం చేసేశారు. అయినా.. ఒకరిని ఒకరు మర్చిపోలేక వారిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇది నచ్చని యువతి కుటుంబసభ్యులు అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. జగిత్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Jagtial District Crime News Today : పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండల కేంద్రానికి చెందిన వంశీ అనే యువకుడు తుంగూర్‌లో ఉన్న ఓ డ్రైవింగ్ స్కూల్‌లో పని చేస్తున్నాడు. ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో గతంలో ప్రేమాయణం నడిపాడు. ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో రెండు సంవత్సరాల క్రితం ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిపించారు. అయినప్పటికీ వంశీ, ఆ యువతి తరచూ ఫోన్‌లో మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేస్తున్నారన్న అనుమానంతో ఆమె కుటుంబసభ్యులు వంశీని పలుమార్లు హెచ్చరించారు. అయినా అతడిలో మార్పు కనిపించడం లేదన్న కోపంతో హత్య చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం పథకం రచించి.. సమయం కోసం ఎదురు చూశారు.
ఆ సమయం ఆదివారం రానే వచ్చింది. వంశీ కొల్వాయి నుంచి తుంగూర్‌కు బైక్‌పై వస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించారు. అనంతరం గొడ్డలి, ఇతర ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వంశీ బంధువులు, గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను తమకు అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించగా.. మృతుడి బంధువులు అక్కడే ఉన్న లారీ కింద పడుకుని తమకు న్యాయం జరిగేంత వరకు కదలనిచ్చేది లేదని నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో చివరకు శాంతించారు.