తెలంగాణ ప్రభుత్వం గత అయిదేళ్లుగా హరితహారంలో ప్రతి ఒక్కరిని భాగస్వాముల్ని చేస్తూ.. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో సైతం పచ్చదనం పెంచేందుకు హరితహారంతో పాటు.. పల్లె ప్రకృతి వనాల పేరుతో చిట్టడవుల నిర్మాణం చేపడుతుంది. ఒక్కో గ్రామానికి ఎకరం నుంచి రెండెకరాల విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనాలు నిర్మిస్తున్నారు. ఒకే దగ్గర 2 నుంచి 4వేల మొక్కలను పెంచుతున్నారు. గ్రామ ప్రజలు ఉదయం, సాయంత్రం ప్రకృతి వనాల్లో సేద తీరుతూ ఆహ్లాదాన్ని పొందేలా తీర్చిదిద్దుతున్నారు.
యుద్ధప్రాతిపదికన పనులు..
జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలుండగా.. 420 వరకు ప్రకృతి వనాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 285 ప్రకృతి వనాలు అందుబాటులోకి వచ్చాయి. మిగతా వాటి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని, కాసేపు ప్రకృతి వనంలో సేదతీరితే.. ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.