Manauru Manabadi Program: "మన ఊరు-మన బడి" పథకం కింద జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 4 ప్రాథమిక పాఠశాలలు, 3 ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో 'మన బస్తీ-మన బడి' పథకం కింద.. 24 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా 2 మూత్రశాలలు, వంటశాల, ప్రహారీ గోడ, నీటి సంపుతోపాటు పాఠశాల మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం కోసం ప్రణాళిక రూపొందించారు. గుత్తేదారు పనులు ప్రారంభించినప్పటికీ.. బిల్లులు రాకపోవటంతో పనులు మధ్యలోనే నిలిపివేశారు.
నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవటం, ఎక్కడికక్కడ ఉంచిన సామగ్రితో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఐదోతరగతి వరకు ఉన్న ఇందిరానగర్ పాఠశాలలో 180 మందికి 2గదులు మాత్రమే ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుబయట, చెట్ల కింద కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. మెట్‌పల్లి మినీస్టేడియం పక్కన ఉన్న గాజులపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మన బస్తీ-మన బడి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం.. అభివృద్ధి కోసం 11 లక్షల రూపాయలను మంజూరు చేసింది.
ఇప్పటివరకు గుత్తేదారుకు కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే రావటంతో.. మధ్యలోనే పనులు నిలిపివేశారు. నిర్మాణంలో భాగంగా ఇక్కడ తీసిన గోతులు ప్రమాదకరంగా మారాయి. అటు శివాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో 175 మంది విద్యార్థులు ఉండగా.. 2 మాత్రమే తరగతి గదులు ఉన్నాయి. పథకంలో భాగంగా ప్రభుత్వం ఈ పాఠశాలను ఎంపిక చేసినా గదులు నిర్మించటంలేదంటున్నారు.