Central Election Commission inquiry in Jagtial: జగిత్యాల ఎన్నికలు, ఈవీఎంల భద్రతపై ఈసీ విచారణ చేపట్టనుంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడంతో కమిషన్ నేడు జగిత్యాలకు వచ్చి విచారణ జరపనుంది. 2018 సాధరణ ఎన్నిక్లలో అక్రమాలు జరిగాయంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గతంలో హైకోర్టులోని కేసు వేశాడు. ఇన్నాళ్లు విచారణ కొనసాగుతునే ఉంది. ఈ నెల 10న హైకోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల వీఆర్‌కే ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులతో కలిసి వెళ్లారు. 3 రూమ్‌లలో భద్రపరచగా ఒక రూమ్ తాళం చెవి మాత్రమే అధికారుల వద్ద లభ్యమైంది. దీనిపై మరోసారి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హైకోర్టుకు రాత పూర్వకంగా రాసి ఇచ్చారు. తాళం చెవుల మాయంపై హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను విచారణ జరపాలని ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలతో నాచుపల్లి దగ్గర ఉన్న జేఎన్టీయూ కళాశాలలో ఈ విచారణ కొనసాగనుంది. ఈ విచారణకు అప్పటి ఎన్నిక్లలో పాల్గొన్న కలెక్టర్, బదిలీ అయిన కలెక్టర్‌తో పాటు ఆ ఎన్నికల్లో పాల్గొన్న అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణ నేపథ్యంలో జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు గత సుమారు 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.