ముంచెత్తిన కుండపోత వాన.. చెరువులకు గండ్లు రైతులకు కడగండ్లు Telangana Rains Latest News : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లో లెవెల్ వంతెనలపై వరద నీరు ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుంపెల్లి మొరంవాగులో ఓ బాలుడు గల్లంతయ్యాడు. తల్లి కళ్ల ముందే కుమారుడు గల్లంతుకావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వాంకిడి మండలంలోని ఖిరిడి గ్రామంలో పాఠశాల సహా.. ఎస్సీ కాలనీలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సిరాల చెరువుకు గండి.. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని సిరాల చెరువు.. భారీ వర్షాలకు గండి పడింది. 500 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. వరద వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా హెల్త్‌క్యాంప్ నిర్వహించి.. గ్రామస్థులకు ఔషధాలు అందించారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో సర్వం నష్టపోయామని తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉగ్రరూపు దాల్చింది. బిద్రేల్లి వద్ద జాతీయ రహదారి కోతకు గురైంది. రోడ్డు కోతకు గురవ్వడంతో ఓ వాహనం బోల్తా పడింది.
Crops washed away in telangana rains : మంచిర్యాల జిల్లా చెన్నూరు, కోటపల్లి మండలాల్లో 500 ఎకరాల పంట పొలాలు నీటి మునిగాయి. పత్తి, ఇతర పంట పొలాల్లో నీరు చేరాయి. గోదావరి పరివాహక ప్రాంతాలలో ప్రత్యేక అధికారి భారతి హోళీకేరి పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్లంపల్లి జలాశయం నీటి విడుదలతో.. మంచిర్యాలలోని రాంనగర్, ఎన్టీఆర్ నగర్, ఆదిత్య కాలనీలలోకి వరద నీరు చేరింది.
Floods in nizamabad : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. పురాతన శివాలయం నదిలో నీట మునిగింది. జిల్లా వ్యాప్తంగా 21 వేల 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా పంటపొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
వాగులో కొట్టుకుపోయిన గొర్రెలు.. నవీపేట్ మండలంలో రహదారులు కోతకు గురయ్యాయి. బినోల, నాడాపూర్ గ్రామాలకు వెళ్లే రహదారి.. అర కిలోమీటర్ మేర దెబ్బతింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట, పోతారం గ్రామాల మధ్య వాగు పొంగింది. వాగు దాటుతున్న గొర్రెలు కొట్టుకుపోయాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టుకు గండి పడింది. కోతకు గురైన ప్రాంతంలో ఇసుకబస్తాలు వేశారు. వీణవంక మండలంలోని పలు గ్రామాల ప్రజల్ని.. అధికారులు అప్రమత్తం చేశారు.
మున్నేరు వరదపై మంత్రి పువ్వాడ.. సమీక్షజగిత్యాల జిల్లాలో వరదల దాటికి రోడ్లు కోతకు గురై పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనంతారం జాతీయ రహదారి వంతెన తెగిపోయింది. సారంగపూర్ పెంబట్ల వద్ద నిర్మించిన తాత్కలిక వంతెన కొట్టుకుపోయింది. మెట్‌పల్లి పురపాలిక పరిధిలో వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితుల్ని సహాయక శిబిరాల్లో ఉంచారు. ఖమ్మం జిల్లా మున్నేరు వరదపై మంత్రి పువ్వాడ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపడంతో.. వరదల్లో చిక్కుకున్న 78 మంది ప్రాణాలను కాపాడగలిగామని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని సత్కరించారు.
Edupayala temple in medak : గుండాల మండలంలోని ముత్తాపురంలో నీట మునిగిన ఇళ్లను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులకు నిత్యావసర సరుకులు అందించారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు నిండాయి.
అవుసులపల్లి వద్ద మట్టిరోడ్డు కోతకు గురైంది. రామాయంపేట నుంచి మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదపూర్‌లో రోడ్డు గుంతలమయంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. జహీరాబాద్‌లో ముంపు కాలనీలను సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్‌రావు.. ప్రజలు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.
ఇవీ చదవండి: