తమ పార్టీలో చేరాలని తెరాస, భాజపా తనను సంప్రదించాయని తెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ(L. Ramana) తెలిపారు. పార్టీ మార్పుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు.
L.Ramana: 'పార్టీలో చేరాలని తెరాస, భాజపా నన్ను సంప్రదించాయి' - l.ramana on party changing
10:04 June 14
రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి: ఎల్.రమణ
ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలోనే తెదేపాలో చేరా. బలహీనవర్గాల బిడ్డగా తెదేపాలో చేరి పార్టీ అభివృద్ధికి కృషి చేశా. ఎన్టీఆర్ నాకు రాజకీయ జన్మనిచ్చారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ నన్ను ప్రోత్సహించారు. తెదేపా చరిత్రలో ఎవరూ పదిసార్లు పార్టీ బి-ఫారంపై పోటీ చేసి ఉండరు. ఆ అవకాశం నాకు దక్కింది. తెదేపా ఆరంభం నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధికి కృషి చేశాను. తెదేపా మూల సిద్ధాంతమైన బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి పాటుపడ్డాం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు స్వయంగా నేనే బరిలో దిగాను.
- ఎల్.రమణ, తెతెదేపా అధ్యక్షుడు
తెదేపా అధికారంలో లేకున్నా నిరంతరం శ్రమించామని రమణ(L. Ramana) అన్నారు. రాజకీయాల్లో అనేక రకాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నామని తెలిపారు. పదవుల్లో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశామని ఉద్ఘాటించారు.