రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్‌లో భాగంగా మహిళా సంఘాలు సహజ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా అంతర్గాంకు చెందిన స్ఫూర్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో పసుపు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సంఘం నుంచి 3 లక్షల రుణం తీసుకుని... యంత్రాలు, పెట్టుబడికి వినియోగించారు. రైతుల నుంచి పసుపు కొమ్ములను కొని... యంత్రం ద్వారా పొడి తయారు చేస్తున్నారు. "సహజ" బ్రాండ్ పేరుతో 250 గ్రాముల ప్యాకెట్ చొప్పున పసుపు తయారు చేసి... మార్కెటింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవలే ఈ యూనిట్‌ను ప్రారంభించారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి... వినియోగదారులకు అందించేందుకు సెర్ప్ అధికారులు సహకారం అందిస్తున్నారు.
మార్కెటింగ్ ఏర్పాట్లు చేస్తాం..
మహిళలు తయారు చేసిన ఈ పసుపు ప్యాకెట్లను ఇతర ప్రాంతాలకు పంపించి మార్కెట్ చేస్తామని సెర్ప్ అధికారులు భరోసా ఇస్తున్నారు. వీరికి ఐసీఐసీఐ ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇప్పించారు. తొలిసారిగా చేపట్టిన ఈ పసుపు తయారీ కేంద్రం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.