Special Story on Medical Student Mahender in Jagtial :కటిక నిరుపేద అయిన ఆ విద్యార్థి కష్టపడి చదివాడు. నీట్ (National Eligibility cum Entrance Test) లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ప్రభుత్వ సీటు సాధించినా.. ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన కనీస డబ్బులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఫలితంగా ఫీజులు కట్టలేక వైద్యవిద్య (Medical Education) కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫీజులు కట్టకపోతే వైద్యుడిగా ఎదుగాలన్న కల నిజం కాదేమోనని ఆ విద్యార్థి ఆందోళన చెందుతున్నాడు.
వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన ఎనుగంటి నర్సయ్య, గంగవ్వ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మహేందర్ చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉంటూ 10వ తరగతిలో 10 జీపీఏ, ఇంటర్ బైపీపీ (BIPC)లో 982 మార్కులు సాధించాడు. తొలుత నీట్‌లో 7,000 ర్యాంకు సాధించాడు. అయితే అతనికి సీటు రాలేదు.
Mahender Secured Seat in Govt Medical College :కరీంనగర్‌లోని ఓ కళాశాల యాజమాన్యం.. ఉచితంగా కోచింగ్ ఇవ్వడం వల్ల ఈసారి నీట్‌లో 527 మార్కులతో 1,580 ర్యాంకు సాధించాడు. దీంతో నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది. ఫీజులు, ఇతర ఖర్చులకు ఏడాదికి రూ.2 లక్షల దాకా కావాలి. మహేందర్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో ఫీజులు కట్టకపోతే వైద్యవిద్యకు దూరమవుతానని ఆయువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు గానీ, ప్రభుత్వం గానీ సాయం అందించేలా చూడాలని కోరుతున్నారు.