తెలంగాణ

telangana

ETV Bharat / state

Gurukula School Problems: ఆ గురుకులంలో విద్యార్థులకు అన్నీ హాల్లోనే..! - mahatma jyotiba phule school list in telangana

380 మంది చదువుకునే గురుకులం అది. సుశిక్షితులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్య అందుతున్నప్పటికీ అక్కడి అసౌకర్యాలు విద్యార్థులకు శాపంగా మారాయి. కనీస వసతుల్లేవంటూ తల్లిదండ్రులు వారి పిల్లలను ఇళ్లకు తీసుకెళుతున్నారు. ఎన్నో ఆశలతో బడికి పంపించినా...చాలీచాలని అద్దె భవనం సమస్యగా మారిందని ఆవేదన చెందుతున్నారు.

so many problems in ailapur Mahatma Jyothiba Phule Bc Welfare Gurukula School
so many problems in ailapur Mahatma Jyothiba Phule Bc Welfare Gurukula School

By

Published : Nov 22, 2021, 5:00 AM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్​లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో అసౌకర్యాలు(Gurukula School Problems) తిష్ఠ వేశాయి. పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో గ్రామం మధ్యలో ఉన్న ఓ ఇంటిలో నడుపుతున్నారు. 380 మంది విద్యార్థులు ఉన్న ఈ గురుకులంలో అసౌకర్యాలతో విద్యార్థులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో కనీసం ప్రార్థన చేసేందుకు కూడా సరైన విధంగా స్థలం లేదు. గదులు సరిగా లేక ఉన్న వాటితోనే సర్ధుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకే గదిలో భోజనం చేయడం, ఆ గదిలోనే తరగతులను నడిపించడం, రాత్రి అందులోనే పండుకునే దుస్థితి. ఇలాంటి వాతావరణంలో విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. గురుకుల పాఠశాలను అన్ని సౌకర్యాలు ఉన్న భవనంలోని మార్చాలని గతేడాది నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు విన్నవించినా.. అధికారులు కనీసం ఆ పాఠశాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.

గత్యంతరం లేక ఇళ్లకు..

అసలే గురుకులాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులందరినీ ఒకే గదిలో వసతి కల్పించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలొస్తే పిల్లల భవిష్యత్తేంటని ప్రశ్నిస్తున్నారు. చదువు బాగున్నా... మౌలిక వసతులు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో.. జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. అధికారులకు పాఠశాల సమస్యలు విన్నవించారు. ఎన్ని సార్లు చెప్పినా.. ఎవరూ పట్టించుకోకపోవటం వల్ల గత్యంతరం లేక విద్యార్థులందరినీ పాఠశాల నుంచి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్తున్నారు.

కొత్త భవనం వెతికే పనిలో..

విద్యార్థులకు వసతి సమస్య ఉన్నది వాస్తవమేనని పాఠశాల ఉపాధ్యాయులు కూడా అంగీకరిస్తున్నారు. సమస్యను కలెక్టర్‌కు నివేదించామని, వారి ఆదేశానుసారం కొత్త భవనం వెతికే పనిలో పడ్డామని చెబుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్ని సౌకర్యాలున్న కొత్త భవనం సమకూర్చాలని తల్లదండ్రులు వేడుకుంటున్నారు. లేదంటే చిన్నారుల చదువు అటకెక్కుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details