అబల చేతిలోనే ఆయుధం.. ఇద్దరిమిత్రుల వినూత్న ఆవిష్కరణ మానవత్వానికే మచ్చ తెచ్చిన దిశ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపడం మాట అటుంచితే.... ఆడపిల్లల మనసుల్లో తమ రక్షణకు సంబంధించి మౌన రోదన మిన్నంటుతోంది. తల్లిదండ్రుల గుండెల్లోనూ గుబులు రెట్టింపైందన్నది నిజం. ఆపద సమయాల్లో పెప్పర్‌స్ప్రే, కారంపొడి, కత్తి, పెన్సిల్ లాంటి చిరు ఆయుధాలను ఆత్మరక్షణ కోసం వినియోగించాలని అమ్మాయిలకు నిపుణులు సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు, పోలీసుల సూచనలు, హామీలు పక్కనపెడితే.... ప్రతి అమ్మాయీ తనను తాను రక్షించుకోవడం నేర్చుకోవాలి. అనుకోని దాడులను ఎదుర్కునేందుకు కొన్ని వస్తువులు ఎప్పుడూ వెంట ఉంచుకోవాలన్నది నిపుణుల సూచన. అలాంటి ఓ వస్తువునే తయారుచేశారు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సాయితేజ, విశాఖకు చెందిన హరీశ్. సెల్ఫ్ సెక్యూరిటీ బ్యాంగిల్ పేరుతో ఓ సరికొత్త పరికరం ఆవిష్కరించారు.
మహిళల రక్షణ కోసం ఏదైనా తయారుచేయాలని హరీశ్ భావించాడు. గతంలో ఆల్కహాలిక్ డిటెక్టివ్ పరికరం తయారుచేసిన సాయితేజకు... తన ఆలోచన వివరించాడు. నెల రోజుల్లోనే తన కోడింగ్ పరిజ్ఞానంతో ఓ గాజు తయారుచేశాడు సాయితేజ. ప్రయోగాత్మకంగా పలువురు అమ్మాయిలతో ఈ గాజు పనితీరును పరిశీలించి, సత్ఫలితాలు పొందారు.
ఎలా పనిచేస్తుంది..
గాజు ఆకారంలో ఉండే పరికరం మొబైల్ యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. ఆపద సమయంలో పరికరం ధరించిన మహిళ చేతిని ఆరు సార్లు అటు ఇటు తిప్పితే పరికరం యాక్టివేట్ అవుతుంది. వెంటనే జీపీఎస్ ద్వారా యాప్‌లో ముందుగానే నమోదు చేసిన ఫోన్ నంబర్లకు మెసేజ్ రూపంలో పంపిస్తుంది. ప్రతిఘటించేందుకు వీలుగా ఎదుటి వ్యక్తికి షాక్ ఇస్తుంది. ఆ వ్యక్తి తేరుకునే లోపలే సదరు మహిళ, బాలిక అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా పలువురు అమ్మాయిలతో ఈ గాజు పనితీరును పరిశీలించిన సాయితేజ, హరీశ్‌లు.. పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా గాజు రూపొందించి విజయం పొందిన సాయితేజ... సన్నని బ్యాండ్, వివిధ రకాల గాజులు, చేతి గడియారాల రూపంలో తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దేశంలోని ఆడపిల్లలందరికీ సోదరభావంతో ఈ పరికరాన్ని అంకితం చేస్తోంది హరీశ్ ద్వయం.
ఇంటి నుంచి బయటకు వెళ్తే తమ రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందని కలత చెందుతున్న తమ లాంటి వారికి.... ఈ పరికరం కొంత ధైర్యాన్నిస్తుందని విద్యార్థినులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి: దిశ హత్యాచార ఘటన మరవకముందే.. ఏపీలో మరొకటి...