రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. వేల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతుండటం వల్ల జలుబు, దగ్గు లక్షణాలున్న వారంతా కొవిడ్ నిర్ధరణ పరీక్ష కోసం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
జగిత్యాల జిల్లాలో కరోనా నిర్ధరణ పరీక్ష కిట్ల కొరత ఏర్పడి రెండ్రోజులుగా పరీక్షలు నిలిచిపోయాయి. జిల్లాలో ఒక్కో సెంటర్కు దాదాపు 300 మంది బాధుతులుండగా.. 75 కిట్లు మాత్రమే ఇచ్చారని సిబ్బంది తెలిపారు. కిట్లు లేకపోవడం శుక్రవారం రోజున జిల్లా వ్యాప్తంగా దాదాపు వేయి మంది బాధితులు వెనుదిరిగారు. సారంగాపూర్, రాయికల్ ప్రాంతాల్లో బాధితులు ఆందోళనకు దిగారు.
జిల్లాలో రోజుకు 10వేల కిట్లు అవసరం ఉండగా.. కేవలం 2వేల కిట్లు మాత్రమే అందజేయడం వల్ల కొరత ఏర్పడింది. సోమవారం మధ్యాహ్నానికి కిట్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండ్రోజులు కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిలిచిపోవడం వల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
లక్షణాలున్న వారు ఇళ్లలో ప్రత్యేక గదిలో ఉండాలని, స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో రోజుకు 700లకు పైగా కేసులు నమోదవుతున్న క్రమంలో పరీక్ష కిట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కొవిడ్ వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం వల్ల దాదాపు 20 సెంటర్లను మూసివేశారు.