Jagtial master plan draft cancelled: మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ.. విలీన గ్రామాల రైతులు చేపట్టిన నిరసనలతో జగిత్యాల మున్సిపాలిటీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రతిపాదిత బృహత్ ప్రణాళిక ముసాయిదాను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పక్షం రోజులుగా విలీన గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలతో పురపాలిక కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పురపాలిక ఛైర్‌పర్సన్ శ్రావణి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ భేటీలో గతంలో ముసాయిదా ఆమోదించి పంపిన తీర్మానాన్ని తిరస్కరించాలని కోరారు.
విలీన గ్రామాల రైతుల భూములను చేర్చడంపై అభ్యంతరాలు:జగిత్యాల పట్టణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో.. విలీన గ్రామాల రైతుల భూములను చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమ భూములను రిక్రియేషన్, పారిశ్రామిక, వాణిజ్య జోన్‌లలో చేర్చడంపై రైతులు ఆందోళనబాట పట్టారు. ముసాయిదాపై అవగాహన కల్పించకుండానే.. మార్చిలో తీర్మానాలు చేసి పంపడంతో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రతిపాదనలో గ్రామాల్ని చేర్చడంపై రైతులు నిరసనలకు దిగారు. జగిత్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రద్దు చేసినా.. గ్రామాలను కలపకుండా మరో ప్రణాళిక రూపొందిస్తామని మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి తెలిపారు. విపక్షాలు రైతులను కావాలనే రెచ్చగొట్టి సమస్యను జఠిలం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు.
జీవోను కూడా పూర్తిగా రద్దు చేయాలి:మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు కోరుతూ మున్సిపాలిటీ చేసిన తీర్మానంపై.. రైతులు, ప్రభావిత విలీన గ్రామాల సర్పంచ్‌లు మాత్రం ఇంకా స్పష్టతలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీర్మానం చేసినందుకు సంతోషమే గానీ.. జీవోను కూడా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల పురపాలిక తీర్మానాన్ని స్వాగతించిన అన్నదాతలు.. సర్కార్ జీవో పూర్తిగా రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.