కరోనా ప్రభావంతో గత నాలుగైదు నెలలుగా పిల్లలు బడికి, పుస్తకాలకు దూరమయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు మందగిస్తుందని ఆలోచించిన ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు బోధించడం ప్రారంభించింది. ఇంటి వద్దనే ఉంటూ.. డిజిటల్ పాఠాలు వినేలా ప్రణాళిక రూపొందించి అన్నీ పాఠాశాలలకు పంపింది. అయితే.. మామూలు రోజుల్లోనే బడికి సరిగా రాకుండా.. వచ్చినా పాఠాలు వినకుండా సతాయించే పిల్లలు.. ఇంట్లో కూర్చుని బుద్ధిగా ఆన్లైన్ పాఠాలు వినమంటే వింటారా..? అస్సలు వినరు. అందుకే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరికొత్త ఎత్తుగడతో పిల్లలు రెగ్యులర్‌గా ఆన్లైన్ పాఠాలు వినేలా ప్లాన్ వేశారు.
ఆన్లైన్ క్లాసులు వింటే.. బహుమతి ఇస్తున్న హెడ్మాస్టర్! - ఆన్లైన్ తరగతులు
మామూలు రోజుల్లోనే పిల్లలు బడికి రావాలంటే నానా తిప్పలు పెడతారు. వారికి ఏదో ఒక ఆశ చూపి తల్లిదండ్రులు బడికి పంపిస్తుంటారు. ఇక ఉపాధ్యాయులైతే.. వారు బడి ఎగ్గొట్టకుండా ఉండడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటిది.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఉండి చదువుకొమ్మంటే మాట వింటారా? అందుకే.. జగిత్యాల జిల్లాలో ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ వినూత్నంగా ఆలోచించారు. ఏం చేశాడో తెలియాలంటే.. పూర్తి కథనం చదువాల్సిందే!
ఫకీర్ కొండాపూర్ర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల ప్రేమ్ కుమార్. ప్రతి విద్యార్థి ఆన్లైన్ తరగతులు వినేందుకు తనదైన శైలిలో ఎత్తుగడ వేశారు. ఈ పాఠశాలలో ప్రతిరోజు మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు జరిగే ఆన్లైన్ తరగతులను ప్రతి విద్యార్థి వినేలా ప్రత్యేక కృషి చేస్తున్నారు. నిత్యం ఆన్లైన్లో బోధించే పాఠాల నుంచి ఒక వర్క్‌షీట్ తయారు చేస్తున్నారు. వాటిని జిరాక్స్ తీయించి.. ఆన్లైన్ తరగతులు అయిపోగానే.. ప్రతీ విద్యార్థి ఇంటికి వెళ్లి వాటిని పిల్లలకు అందజేస్తున్నాడు. మరునాడు వాటిని తీసుకొని మూల్యాంకనం చేస్తున్నారు. వర్క్‌షీట్‌లో పదికి పది మార్కులు వచ్చిన పిల్లలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తున్నారు. అటు బహుమతుల కోసం.. ఇటు హోం వర్క్ కోసం పిల్లలు ఆసక్తిగా ఆన్లైన్ తరగతులు వింటూ.. వర్క్షీట్లు పూర్తి చేసి.. బహుమతులు గెలుచుకుంటున్నారు.
మా పాఠశాలలో చదివే ఒక్క విద్యార్థి కూడా ఆన్లైన్ క్లాసులు జరిగే సమయంలో బయట తిరగకుండా శ్రద్ధగా తరగతులు వినేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఇలా చేస్తున్నాం అంటున్నారు హెడ్మాస్టర్ ప్రేమ్ కుమార్. అంతేకాదు.. పాఠశాలలో హరితహారంలో విద్యార్థులు నాటిన మొక్కలను.. లాక్డౌన్ సమయం నుంచి ప్రతిరోజు కాపాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. హెడ్మాస్టర్ ప్రేమ్ కుమార్ ఆలోచనను గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మెచ్చుకుంటున్నారు.