Three arrested in theft at Anjanna temple in Kondagattu: కొండగట్టు అంజన్న ఆలయంలో గత నెల 23 అర్థరాత్రి చొరబడిన దొంగలు.. 15 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. శఠగోపం, వెండి గొడుగు వెండి రామ రక్ష ఇలా వివిధ రకాల వస్తువులు అందులో ఉన్నాయి. కేసును సవాలుగా తీసుకున్న జగిత్యాల పోలీసులు.. సాంకేతికతో చాకచాక్యంగా చోరులను పట్టుకున్నారు.
Theft in Kondagattu Anjanna Temple: చోరీకి ముందే దొంగలు రెండుసార్లు రెక్కి నిర్వహించారు. గత నెలలో సీఎం కేసీఆర్ ఆలయానికి రాగా, అంతకు ముందే ఒకసారి రెక్కి నిర్వహించి వెళ్లారు. మొదట అనుకూలంగా లేక పోవటంతో, మళ్లీ గత నెల 22న పసుపు రంగు దుస్తుల్లో భక్తుల రూపంలో వచ్చి రెక్కి నిర్వహించారు. 23వ తేదీన అర్ధరాత్రి దాటాక ఆలయంలో చొరబడ్డ దొంగలు.. 15 కిలోల వెండి అభరణాలు అపహరించుపోయారు. చోరీ పూర్తయ్యాక.. తీరిగ్గా ఆలయం వెనకాల బీర్లు తాగి అక్కడే పడేశారు.
ఆ బీరు సీసానే దొంగలను పట్టించింది. డాగ్ స్కాడ్‌తో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాబిన్ అనే జాగిలం.. దొంగలు తాగి పడేసిన బీరు సీసా వద్దకు వెళ్లి ఆగింది. బీరు సీసాపై ఉన్న వేలి ముద్రల ఆధారంగా ఆధునిక సాంకేతికతో, నిందితుని ఆధార్‌ను గుర్తించగలిగారు. కర్ణాటక బీదర్‌లో ఉన్న నిందితుల్ని 10 బృందాలుగా వెళ్లి పట్టుకున్నారు. ముగ్గురు పట్టుబడగా, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు జగిత్యాల ఎస్పీ భాస్కర్ తెలిపారు.