Murders in Jagtial: జగిత్యాల టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం నాగేశ్వర్‌రావు అతని ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్ రెండురోజుల క్రితం హత్యకు గురయ్యారు. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో అదేకాలనీకి చెందిన కొందరు కత్తులు, బరిసెలతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఆకేసులో 8 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి పోలీసు భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఐతే అంత్యక్రియలకు కాలనీవాసులు, గ్రామస్థులు ఎవరూ హాజరు కాలేదు. భయంతో బంధువుల ఇళ్లలో తల దాచుకున్న నాగేశ్వర్‌రావు చిన్న కుమారులు రాజేశ్, విజయ్ అంత్యక్రియల్లో పాల్గొనకపోవడంతో బంధువులే దగ్గరుండి పూర్తిచేశారు. తామంతా కలిసే నిర్ణయం తీసుకొని చంపామని పోలీసుల ముందు కాలనీవాసులు బహిరంగంగా తెలిపారు. మిగిలిన వారినీ హతమారుస్తామని హెచ్చరించారు.
Murders in Jagtial: జగిత్యాల హత్యల కేసు.. పోలీసు భద్రత నడుమ అంత్యక్రియలు - పోలీసులు దర్యాప్తు
Murders in Jagtial: జగిత్యాలలోని టీఆర్నగర్లో జరిగిన తండ్రి, కుమారుల హత్యలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 8 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మరికొందరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మంత్రాలు చేయటంతోనే అంతా కలిసే హత్య చేశామని పోలీసులకు కాలనీ వాసులు తెలిపారు.
Police investigating the murder case: నాగేశ్వర్‌రావు అధిక వడ్డీలకు అప్పులిచ్చేవాడు. దానికితోడు గ్రామంలో ఎవరు చనిపోయినా.. అతను మంత్రాలు చేస్తేనే చనిపోతున్నారని కాలనీ వాసులు బలంగా విశ్వసించారు. అందుకే నాగేశ్వర్‌రావు కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో గత నెలలో సిరిసిల్ల సమీపంలో అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నం జరిగింది. కారుపై దాడి జరగగా తండ్రి, ఇద్దరు కుమారులు తప్పించుకున్నారు. కాలనీవాసుల్లో మూఢనమ్మకాలు బలంగా నాటుకుపోయాయన్న పోలీసులు వాటిని తొలగించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేశారు.