Ethanol Rice Bran Oil Company : జగిత్యాల, ధర్మపురి ప్రాంతంలో వరి, మొక్కజొన్న ఎక్కువగా సాగవటం, పుష్కలమైన నీరు అందుబాటులో ఉంది. రోడ్డుతో పాటు దగ్గరలో మంచిర్యాల, పెద్దపల్లి రైలు మార్గాలు, రామగుండం ఎరువుల కర్మాగారం ఉండటంతో పరిశ్రమ ఏర్పాటుకు క్రిభ్‌కో ఆసక్తి చూపింది. కంపెనీ విస్తరణలో భాగంగా జగిత్యాల జిల్లా స్తంభంపల్లి వద్ద ఇథనాల్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమను త్వరలోనే ఏర్పాటు చేస్తామని క్రిభ్‌కో కంపెనీ ప్రకటించింది. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి శివారులోని 1091 సర్వే నంబర్‌లో కంపెనీ ఏర్పాటుకు భూమి చదును చేయడంతోటే ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. రూ.750 కోట్ల ఫ్యాక్టరీ నిర్మిస్తే ఏడాదికి ఎనిమిది కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో కంపెనీని స్థాపించవచ్చని క్రిభ్‌కో ఛైర్మెన్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో ధాన్యం, మక్క ఎక్కువ సాగు కావడం, పుష్కలమైన నీరు ఉండడం, రోడ్డుతోపాటు దగ్గరలో మంచిర్యాల, పెద్దపల్లి రైలు మార్గాలు అందుబాటులో ఉండడం కంపెనీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. దగ్గరలోనే రామగుండం ఎరువుల తయారీ కంపెనీ కూడా ఉండడం కలిసి వస్తుందన్నారు.
మెరుగ్గా ఉపాధి అవకాశాలు:ఈ పరిశ్రమ ఏర్పాటైతే ధర్మపురి ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. వరి, మక్క, నూకలతో ఇథనాల్ తయారవుతుంది. ఈ ప్రాంత రైతులకు వరి, మక్క ఎక్కడ అమ్ముకోవాలన్న ఆందోళన ఉండదని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో భూమి చదును చేయడంతోటే ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ఫ్యాక్టరీ నిర్మించవద్దని డిమాండ్ చేస్తున్నారు. వివిధ పద్దతుల్లో తమ నిరసనను కొనసాగిస్తున్నారు.