పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రం రామనామ జపంతో భక్త జన సంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూల నుంచి దీక్షా పరులు తరలి వచ్చి అంజన్న చెంతన దీక్షా విరమణ చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి మొదలైన భక్తుల తాకిడి ఇంకా కొనసాగుతోంది. ఆలయ పూజారులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరుముడితో పాదయాత్రగా వస్తున్న దీక్షాపరులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
తెలంగాణలో అంజన్న వైభవం.. హనుమాన్ ఆలయాల్లో భక్తుల కిటకిట - pedda Hanuman Jayanti
Hanuman Jayanthi 2022 : శ్రీఆంజనేయ.. జై ఆంజనేయ.. జైహనుమాన్.. జైశ్రీరామ్.. అనే నామస్మరణలతో తెలంగాణ మార్మోగిపోతోంది. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అంజనీపుత్రుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గుడి బాట పట్టి.. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
హనుమాన్ జయంతి పురస్కరించుకుని భద్రాద్రి రామయ్య సన్నిధిలో రద్దీ నెలకొంది. పెద్దఎత్తున హనుమాన్ మాలధారులు తరలివచ్చారు. హనుమాన్ మాలధారులతో క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. గోదావరి ఒడ్డున ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో, రామయ్య సన్నిధి వద్దనున్న ఆంజనేయస్వామి ఆలయంలోనూ ఇరుముడులు సమర్పిస్తున్నారు. హనుమాన్ మాలదారులకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జయంతి వేడుకల సందర్భంగా అభయాంజనేయ స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు.