Paripurnananda Swamy: సాక్షాత్తు పార్వతి- లక్ష్మీ స్వరూపమే సమ్మక్క-సారలమ్మలని పరిపూర్ణానంద స్వామి అన్నారు. చినజీయర్ స్వామి సమ్మక్క-సారక్కలపై ఏ విధంగా మాట్లాడారో తెలియదు కానీ అక్కడ మాత్రం దైవశక్తి ఉన్నదని సమ్మక్క-సారలమ్మ కథలు భక్తులకు వివరించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదామరాజుపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ చక్ర ఆలయానికి శంకుస్థాపన కోసం పరిపూర్ణానంద స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పెద్దఎత్తున మంగళహారతులతో స్వామివారిని ప్రత్యేకంగా స్వాగతం పలికారు.
గ్రామ శివారులో గల గోదావరి నది తీరాన విశ్వేశ్వర మహా పీఠం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ చక్ర ఆలయ నిర్మాణానికి పరిపూర్ణానంద స్వామి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం భక్తులను ఉద్దేశించి పరిపూర్ణానంద ప్రవచనాలు ఇచ్చారు. ప్రతి వ్యక్తి దైవ నామస్మరణతో ముందుకు వెళితే చెడును దూరం చేసుకొని మంచి వైపు వెళ్తూ ఉంటామని అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రముఖ దైవ క్షేత్రాలతో పాటు ప్రస్తుతం కొత్తదామరాజుపల్లిలో నిర్మిస్తున్న శ్రీ చక్ర ఆలయం కూడా రానున్న రోజుల్లో భక్తులకు మహాశక్తిగా మారనుందని తెలిపారు.