Mp Santhosh to Adopt Kondagattu 100 Acres Sanctuary: శ్రీరాముడికి నమ్మిన బంటు ఆంజనేయస్వామి స్వయంభుగా వెలసిన ప్రాంతం జగిత్యాల జిల్లా కొండగట్టు. సహజమైన కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును భారతదేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా పునర్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిన్న అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం నిర్ణయానికి మద్ధతుగా... కోట్లాది మంది ఆంజనేయ భక్తులకు బాసటగా కొండగట్టు సన్నిధి వెన్నంటి ఉండే వెయ్యి ఎకరాల అభయారణ్యం "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" తరఫున దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.
సీఎం జన్మదిన కానుకగా ఈ నిర్ణయం : శుక్రవారం(ఫిబ్రవరి 17) సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ సంతోష్‌కుమార్ వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్... స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఆంజనేయుడి ప్రధాన లక్షణాలైన పరాక్రమం, విశ్వాసం సీఎం కేసీఆర్ సొంతమన్న సంతోష్.. అభివృద్ది నిర్ణయాల్లో పరాక్రమం, తెలంగాణ పట్ల ఆయన విశ్వాసం వెలకట్టలేనివని ఎంపీ గుర్తు చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని... కాళేశ్వరం, యాదాద్రి పునర్ నిర్మాణం, ఇప్పుడు కొండగట్టు అంజన్న అభివృద్ధి నిర్ణయమైనా సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని తెలిపారు.