జగిత్యాల జిల్లా మెట్పల్లి శివారులోని వ్యవసాయ భూముల్లో పండించే పంటలకు రక్షణ కరువైంది. కోతుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఇప్పటికే కొంత పంట నష్టపోయిన రైతులకు.. ఈ కోతులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఫలితం లేకుండా పోయింది..
పట్టణ శివారులో పలువురు రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే సుమారు 100కు పైగా కోతులు పంటలపై దాడి చేస్తూ.. చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వానరాల బెడద నుంచి తప్పించుకునేందుకు గతంలో కూరగాయలు సాగు చేసిన రైతులు.. ఈసారి మొక్కజొన్న పంట సాగుచేసినా కోతుల బెడద తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు నీరు పెట్టడానికి వచ్చే సమయంలో ఒకరిద్దరు రైతులు ఉంటే కోతులు దాడి చేస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు.