mlc kavitha: అబద్ధానికి ప్రతిరూపం ఎంపీ అర్వింద్ అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. ఎక్కడికి వెళ్లినా తెరాస చేసిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల నియోజకవర్గ తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కవిత.. విపక్ష నేతలపై విమర్శలు చేశారు.
పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసి గద్దెనెక్కిన అర్వింద్ .. పసుపు రైతులను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మరచి అన్నింటికి ధరలను పెంచడంపై దృష్టి సారించిందని కవిత పేర్కొన్నారు . మరోపక్క జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎప్పుడు చూసినా.. తెరాస పైన, కేసిఆర్ పైనే విమర్శలు చేస్తారన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కనపడటం లేదా.. లేక వారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రతి కార్యకర్త తెరాస పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.