జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన నర్సయ్య, రెంజర్ల లక్ష్మి (48)లకు ముగ్గురు కుమార్తెలు. భర్త గల్ఫ్‌లో ఉండగా, 11 ఏళ్ల కిందట లక్ష్మి అనారోగ్యం పాలైంది. ఓరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులంతా కలిసి అప్పటి నుంచి ఎంత వెతికినా ఫలితం లేదు. రెండేళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దుస్తులను చూసి లక్ష్మివేనని భావించి, కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఆచూకీ ఇలా..
ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మి తమిళనాడులోని పెరంబలూర్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి చికిత్స చేయించింది. ఇటీవల ఆమె కోలుకుని సాధారణ స్థితికి రావడంతో ఆ సంస్థ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. లక్ష్మి బ్రతికే ఉందని మూడు రోజుల క్రితం తమిళనాడులోని పేరంభల్లూర్ పోలీస్ స్టేషన్ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. నర్సయ్య తన కూతుళ్లతో కలిసి అక్కడకు వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఆమె తమిళనాడులో ఉన్నట్లు సమాచారం అందడంతో వెంటనే వెళ్లి... లక్ష్మిని సోమవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయిందనుకున్న ఆమె తిరిగి ఇంటికి చేరడంతో భర్త, కుమార్తెలు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:Census in india: జనగణన వచ్చే ఏడాదే.. డిసెంబరు దాకా భౌగోళిక వివరాల సేకరణ!