మధ్యాహ్న భోజన నిర్వాహకుల పరిస్థితి దీనంగా తయారైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో నాలుగు నెలలుగా వేతనాలు, రెండునెలలుగా మెస్ బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 54 పాఠశాలలున్నాయి. వీటిలో 85 మంది మధ్యాహ్న భోజన కార్మికులుగా పని చేస్తున్నారు.
మెస్ బిల్లులు రాని కారణంగా... విద్యార్థులకు వంట చేసేందుకు అప్పు చేసి కిరాణ సామాగ్రి తీసుకొస్తున్నారు. ఈ అప్పులకు తోడు... సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని, గ్యాస్ నింపించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం రూ. 8 వేలకు పెంచాలని, మెస్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.
అయితే అధికారుల వివరణ మరోలా ఉంది. వంట ఖర్చులు, గుడ్లకు సంబంధించి బిల్లులు నవంబర్ వరకు చెల్లించామని విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. వేతనాలు మాత్రం అక్టోబర్ నుంచి బాకీ ఉందని... బడ్జెట్ రాగానే ఇస్తామని వెల్లడించారు.సకాలంలో బిల్లులు అందితేనే ఇబ్బంది లేకుండా వంట చేయడానికి వీలవుతుందని మధ్యాహ్న భోజన నిర్వాహకులు చెబుతున్నారు.