జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలో 2018లో మిషన్ భగీరథ పనులను అధికారులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులను నత్తనడకన సాగిస్తున్నారు. మొత్తం రూ.29.5 కోట్లతో 80 కిలో మీటర్ల వరకు పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 50 కిలోమీటర్ల వరకు పైపులైన్లు వేసి, సుమారు 60 శాతం పనులు పూర్తి చేశారు. నీటి సరఫరా కోసం పట్టణంలో మూడు కొత్త ట్యాంకుల నిర్మాణంతో పాటు ఓ పాత ట్యాంకును వినియోగించుకుంటూ నాలుగు ట్యాంకుల ద్వారా పట్టణ ప్రజలకు నీటిని సరఫరా చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అయితే భగీరథ పనులు జాప్యం కావడంతో ప్రజలకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. దీంతో నత్తనడకన సాగుతున్న మిషన్ భగీరథ పనులతో పట్టణ ప్రజలు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు.
తాగు నీటి లీకేజీలు
పట్టణంలోని 26 వార్డులలో జరుగుతున్న మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. పురపాలక అధికారులు, భగీరథ అధికారుల సమన్వయ లోపంతో పట్టణ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. జరుగుతున్న పనుల వద్ద అధికారులెవరు ఉండకపోవడంతో గుత్తేదారు ఇష్టం వచ్చినట్లు పైపులను వేస్తున్నారు. గతంలో ఉన్న తాగునీటి పైపులైన్లకు పగుళ్లు వచ్చేలా పనులు చేస్తున్నారు. దీంతో రోజుల తరబడి తాగునీటి లీకేజీ అవుతుంది. ఇళ్లలోకి వచ్చే తాగునీరు సరిగా రాక ప్రజలు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా లీకేజీ నీరంతా మురుగు కాలువలలో కలుస్తున్నాయి. రోడ్లన్నీ నీటితో నిండి బురదమయంగా మారి ప్రజలు నడిచేందుకు కూడా వీలు లేక ఇబ్బందులు పడుతున్నారు.