Mango Crop Loss In Telangana : అసలే ఎండాకాలం.. మామిడి సీజన్ కాలం. కానీ ఈ కాలంలో వచ్చిన అకాల వర్షాలు మామిడి రైతులను నష్టాల్లోకి నెట్టేశాయి. అన్నదాతలపై ప్రకృతి పగ బట్టినట్లుగా కురిసిన వర్షాలతో అన్ని రకాల పంటలూ దెబ్బతిన్నాయి. వరి పంటతో పాటు మామిడి దిగుబడిలోనూ రైతుకు తీవ్ర నిరాశే మిగిలింది. ఉత్తర తెలంగాణలో అత్యధికంగా మామిడి తోటలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోనే దాదాపు 50 వేల ఎకరాల్లో లక్ష 15 వేల టన్నుల మామిడి దిగుబడి వస్తుంది.
ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బంగినపల్లి, హిమాయత్, దశేరీ రకాలనే ఇక్కడి రైతులు సాగు చేస్తారు. వాటిని గ్రేడింగ్ చేసి ఉత్తర భారతదేశం పంపిస్తారు. అక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తారు. దశేరి రకం హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి మెట్రో సిటీలకు ఎగుమతవుతోంది. నాణ్యతతో పాటు రుచి, మంచి పరిమాణంతో కూడిన జగిత్యాల మామిడి కాయలు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయి. ఏటా అధిక మామిడి దిగుబడులతో కళకళలాడే జగిత్యాల మార్కెట్.. ఇప్పుడు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది.
Jagtial Mango Market : ఈసారి ప్రకృతి పగ బట్టడంతో మామిడి రైతుల ఆశలు రాలిపోతున్నాయి. తెగుళ్లతో పాటు ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పూత, పిందెలు రాలిపోయాయి. దీంతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు అంటున్నారు. ఓ వైపు మార్చి నెల ప్రారంభం నుంచే ఎండలు కొడుతుండగా.. మరోవైపు ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు మామిడి రైతుల్ని నష్టాల పాలు చేస్తున్నాయి. మామిడి తోటలు కౌలు తీసుకున్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రూ.10 లక్షలు పెట్టి మామిడి తోటను కౌలుకు తీసుకుంటే.. ఇప్పుడు కనీసం రూ.3 లక్షలు కూడా చేతికి అందని పరిస్థితి నెలకొందని కౌలు రైతులు వాపోతున్నారు.