Manauru Mana Badi program: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి తీసుకొచ్చిన కార్యక్రమం మనఊరు- మనబడి. దాదాపు 7 వేలకోట్ల రుపాయలకుపైగా నిధులతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే కొన్ని చోట్ల అధికారుల అవగాహనలేమితో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఇందిరానగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 182 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంతమంది పిల్లలు చదువుకోవడానికి కేవలం రెండు తరగతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వర్షకాలంలో ఇబ్బందికరంగా ఉంటుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు:మనఊరు-మనబడి పథకం కింద ఇటీవలే ఈపాఠశాలకు 24 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే ఆ నిధులతో అవసరమున్నవి కాకుండా ఇదివరకే ఉన్న నిర్మాణాలు చేస్తున్నారు. పాఠశాలలో ఇప్పటికే మూత్రశాల ఉన్నా.. మళ్లీ రెండు మూత్రశాలలను ఏర్పాటు చేస్తున్నారు. బోరుతోపాటు ఓవర్ హెడ్ ట్యాంకు ఉన్నప్పటికీ మళ్లీ నీటి నిల్వ కోసం సంపును ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదులకు బదులు.. వేరే నిర్మాణాలు చేయడంతో ఏం చేయాలో అర్థం కాక ఉపాధ్యాయులు, విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.